లాక్ డౌన్ లో ఏకంగా 100 సినిమాలు తీశాడట

లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినిమా రిలీజెస్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర…

లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినిమా రిలీజెస్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమలు కుదేలయ్యాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో ఏకంగా 100 సినిమాలు తీశాడు ఓ వ్యక్తి. అతడు మరెవరో కాదు.. శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా.

పోర్న్ చిత్రాలు తీస్తున్నాడనే అభియోగాలపై అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారంలో త్రవ్వే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వంద చిత్రాల వ్యవహారం కూడా బయటకొచ్చింది.

లాక్ డౌన్ నడిచిన ఈ ఏడాదిన్నర కాలంలో రాజ్ కుంద్రా.. ఏకంగా 100 పోర్న్ సినిమాలు తీశాడట. ఆ సినిమాల్ని రకరకాల సామాజిక మాధ్యమాల్లో పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించాడట. అలా కరోనా టైమ్ లో అంతా ఖాళీగా ఇళ్లల్లో కూర్చుంటే, రాజ్ కుంద్రా మాత్రం రెండు చేతులారా సంపాదించాడట.

దీనిపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, క్లూస్ టీమ్ తో కలిసి రాజ్ కుంద్రా, శిల్పాషెట్టి ప్రధాన నివాసంలో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సేకరించారు. ఇక ముంబయిలోనే మరో 2 ప్రాంతాల్లో ఉన్న రాజ్ కుంద్రా గెస్ట్ హౌజ్ లను కూడా తనిఖీ చేశారు. కీలకమైన హార్డ్ డిస్కులతో పాటు లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ కేసుకు సంబంధించి షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే లాంటి అడల్ట్ స్టార్స్ ను కూడా ప్రశ్నించాలని నిర్ణయించారు పోలీసులు. కుంద్రా అరెస్ట్ పై వీళ్లిద్దరూ ఇప్పటికే తమ అభిప్రాయాల్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు కుంద్రా బెయిల్ పిటిషన్ ను కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈనెల 27 వరకు రిమాండ్ ను పొడిగించింది. ఈ 3 రోజుల్లో రాజ్ కుంద్రా నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తామంటున్నారు పోలీసులు.