జగన్ సాధిస్తే అసూయ.. సిగ్గులేని వక్ర ప్రచారం

దేశవ్యాప్తంగా మూడు భారీ బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. దేశం మొత్తానికి మూడే ప్రాజెక్టులు రాబోతున్నాయంటేనే ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనవి, రాష్ట్రాల పారిశ్రామిక ప్రగతి రూపురేఖలు మార్చగలిగేవి.. అని మనకు అర్థమవుతుంది! అందుకోసమే…

దేశవ్యాప్తంగా మూడు భారీ బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. దేశం మొత్తానికి మూడే ప్రాజెక్టులు రాబోతున్నాయంటేనే ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనవి, రాష్ట్రాల పారిశ్రామిక ప్రగతి రూపురేఖలు మార్చగలిగేవి.. అని మనకు అర్థమవుతుంది! అందుకోసమే ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి దేశంలో మొత్తం 13 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 

తమ రాష్ట్రానికి ప్రాజెక్టు కేటాయిస్తే ఇవ్వగల రకరకాల రాయితీలను కూడా ప్రకటించాయి. ఏతావత సుదీర్ఘమైన వడపోత తర్వాత కేంద్రం మూడు రాష్ట్రాలను మాత్రం బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటుకు ఎంపిక చేసింది. వాటిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లతోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే జగన్ ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కుళ్ళు రాజకీయం చేస్తోంది. వక్రనీతిని అనుసరిస్తోంది.

దక్షిణాది నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కోసం పోటీపడ్డాయి. ఈ నాలుగింటిలో ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం దొరికింది. ఏపీని ఎంపిక చేయడం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అక్కసును దాచుకోకుండా వెళ్ళగక్కుతున్నారు. ఫార్మా రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన హైదరాబాదు నగరం కనిపించలేదా.. ఎలాంటి వసతులు లేని రాష్ట్రాలను ఎంపిక చేస్తారా.. అంటూ నిగ్గదీస్తున్నారు! పొరుగు రాష్ట్రం మంత్రి స్వయంగా ఆక్రోశించడాన్ని గమనిస్తే ఈ బల్క్ డ్రగ్ పార్క్ రావడం అనేది.. జగన్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమే అని ఎవరికైనా అనిపిస్తుంది.. ఒక్క తెలుగుదేశం వారికి తప్ప!!

దీనిని చూసి టిడిపి ఓర్వ లేక పోతోంది! అక్కడితో వారు ఆగడం లేదు!! ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాశారు! దీనివలన పర్యావరణానికి చాలా ముప్పు ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సాధారణంగా ఏ పరిశ్రమ వచ్చినా ఆ ప్రాంతాల్లో చిన్నచిన్న లోటుపాట్లు కచ్చితంగా ఉంటాయి. అలాగని పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటే అది ప్రగతిని అడ్డుకోవడమే అవుతుంది. స్థానిక ప్రజలకు ఏర్పడగల ఉపాధి అవకాశాలను అడ్డుకోవడమే అవుతుంది. లోటుపాట్లను ఎలా చక్కదిద్దాలో ఆలోచించాలి, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలతో పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లాలో సూచించాలి! విజ్ఞులైన రాజకీయ నాయకులైతే ప్రజా ప్రయోజనాలను కాంక్షించే వారైతే చేయవలసిన పని ఇది!!

కానీ తెలుగుదేశం పార్టీకి అవేవీ పట్టవు. ఇదే బల్క్ డ్రగ్ పార్క్ అనేది తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి దక్కి ఉంటే గనుక దాని గురించి ఎంతగా డప్పు కొట్టుకొని ఉండేవారో మనం ఊహించడం కూడా సాధ్యం కాదు! అదే విజయం- జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి దక్కేసరికి వారు కుమిలిపోతున్నారు. దీనిపట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకతను నాటడానికి విషప్రచారానికి పూనుకుంటున్నారు. 

ఇలాంటి ద్వంద్వ వైఖరి వక్రబుద్ధులతో ఆ పార్టీ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తుంది? ‘‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తాను’’ అంటూ తన వంకర పొత్తుల కుట్ర రాజకీయాలకు ఒక అందమైన ముసుగు తొడిగే చంద్రబాబు నాయుడు, యనమల చేస్తున్న విషప్రచారానికి ఏం సమాధానం చెబుతారు? ప్రజల పట్ల తమకు జవాబుదారీ తనం ఉందని.. తెలుగుదేశం ఎప్పటికి గుర్తిస్తుంది??