సినిమాల ఫ్లాప్‌లకు బాయ్‌కాట్ కల్చర్ కారణమా?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాలో తమకు నచ్చని విషయాలు ఉంటే… దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వ్యవహారం గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా అప్డేట్ అయ్యారు.…

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాలో తమకు నచ్చని విషయాలు ఉంటే… దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వ్యవహారం గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా అప్డేట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాల్సిందిగా, వెలివేయాల్సిందిగా పిలుపు ఇస్తున్నారు.

సినిమా ప్రచారానికి, ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి సోషల్ మీడియా ఎంత అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతూ వచ్చిందో.. అదేస్థాయిలో సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్‌కాట్ ప్రచారాలు సినిమాల జయాపజయాలను నిర్దేశిస్తున్నాయనే అభిప్రాయం కొందరిలో కలుగుతోంది.

కేవలం కొందరు బాయ్‌కాట్ చేయాల్సిందిగా పిలుపు ఇస్తేనే సినిమా ఫ్లాప్ అయిపోతుందా అనేది ప్రశ్న. సినిమాలో తమ మనోభావాలకు గిట్టని విషయాలు ఉంటే అలాంటి వాటికి సంబంధించి అపాలజీ చెప్పిన తరువాత కూడా సినిమా ఫ్లాప్ అయితే ఏమనుకోవాలి.

అమీర్ ఖాన్ నిర్మించిన లాల్ సింగ్ చడ్డా పరాజయం తర్వాత ఈ బాయ్‌కాట్ కల్చర్‌ను ఈ కోణంలో చూడాల్సి వస్తోంది. సినిమాలో నిజంగా సత్తా ఉంటే గనుక ఎలాంటి బాయ్‌కాట్ ప్రచారాలు పనిచేయవు అని మనకు అర్థమవుతుంది.

లాల్‌సింగ్ చడ్డా చిత్రం అందులోని కంటెంట్ వల్లే దెబ్బతినిపోయింది. ఆ సినిమా బాయికాట్ చేయాలంటూ సోషల్ మీడియా పిలుపు..  ప్రారంభంలో కొంతమంది ప్రేక్షకులను సినిమా వైపు రాకుండా ఆపి ఉండవచ్చు. కానీ సినిమా బాగున్నట్టయితే ఈ ప్రచారాలు దాని విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఆ సినిమాకు తొలి రోజు నుంచీ దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. చివరికి లోకల్ ఫ్లేవర్ కారణంగా ప్రారంభంలో పంజాబ్లో కొంత ఆదరణ కనిపించినా తర్వాత అక్కడ కూడా తిప్పికొట్టారు.

అయితే అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి క్షమాపణ చెప్పడం అనేది ఈ బాయికాట్ కల్చర్‌ను తీసుకు వస్తున్న వారికి మరింత బలం ఇచ్చింది. సినిమాల జయాపజయాలను తాము నిర్దేశించగలం అనే పొగరు వారికి ఏర్పడింది. బ్రహ్మాస్త్ర, విక్రం వేద వంటి భారీ చిత్రాలు సెప్టెంబరు విడుదలకు సిద్ధమవుతుండగా ఈ బాయ్‌కాట్ హీరోలు వాటి మీద ఎలా రెచ్చిపోతారు అనే చర్చ కూడా ఇండస్ట్రీలో ఉంది. 

అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏందంటే అమీర్ ఖాన్ క్షమాపణ చెప్పినంత మాత్రాన సినిమాకు ఒరిగిన మేలు ఏమీ లేదు. అందులో కంటెంట్ బాగుండాలి, అది ప్రజలను ఆకట్టుకోవాలి, హిట్ కావాలి. ఒక సినిమా బాయికాట్ ప్రచారాన్ని తట్టుకొని నిలబడితే, ఆ హిట్ మాత్రమే అలాంటి విమర్శకుల నోర్లు మూయిస్తుంది తప్ప, హీరోలు చెప్పే క్షమాపణలతో ఉపయోగం ఉండదు.

అయితే శోచనీయమైన విషయం ఏంటంటే సినిమాల్లో సత్తా ఎంత ఉందో తేల్చుకోలేని పరిశ్రమ వ్యక్తులు బాయికాట్ కారణంగా సినిమా దెబ్బతినిపోయిందని ఆరోపణలు చేస్తుంటారు, నిందలు వేస్తుంటారు.

తెలుగులో ఇటీవల ఇలాంటి సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కొన్న సినిమా లైగర్. బాయ్‌కాట్ ప్రచారం వల్లనే లైగర్ సినిమా ఫ్లాప్ అయిందంటే ఎవరైనా నమ్ముతారా? బాయ్‌కాట్ పిలుపులను పట్టించుకోకుండా పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ మీద నమ్మకంతో థియేటరుకు వెళ్లిన ఏ ఒక్కరైనా సినిమా చూసి నిరాశ పడకుండా తిరిగి వచ్చారా? ఈ విషయాలను మనం బేరీజు వేసుకోవాలి. 

సినిమాను ఎప్పుడూ కూడా మంచి కంటెంట్ మాత్రమే నిలబెడుతుంది సోషల్ మీడియాలో పోటెత్తే ప్రచారం, కోట్ల రూపాయలు కుమ్మరించి మీడియా ద్వారా తెప్పించుకునే ప్రచారం లేకపోయినప్పటికీ కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా మన కళ్ళముందే ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో నేల విడిచి సాము చేయడం లాగా కంటెంట్ ను పట్టించుకోకుండా ప్రచారాన్ని నమ్ముకుని సినిమా చేద్దాం అనుకునేవాళ్లు మాత్రమే బాయ్ కాట్ ప్రచారాలను ఫ్లాప్ కు సాకులుగా చూపుతారు.