ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు.
ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది.
కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులో విజ్ఞప్తి చేశారు.
చైర్మన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం చర్చాహర్హమైనదేనని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు రూల్ 267 కింద విజయసాయి రెడ్డి నోటీసును అందించారు.
అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షులు ప్రకటించడంతో విజయసాయి రెడ్డి సభలోని వెల్‌లోకి దూసుకువెళ్ళారు. ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు సైతం వెల్‌లోకి చేరుకని నినాదాలు చేశారు.
దీంతో అధ్యక్షులు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేనని తెలిపారు. సభలో విజయసాయి రెడ్డితోపాటు ఇతర పార్టీ సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ఆపాలని కోరాం:
శ్రీశైలం ఎడమ గట్టు పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలని కృష్టా రివర్ బోర్డ్ మేనేజ్‌మెంట్ (కేఆర్‌ఎంబీ) తెలంగాణ రాష్ట్ర జెన్‌కోను కోరినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రస్తుతం శ్రీశైలం రిజర్వార్‌లో నీటిని ఇరిగేషన్, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు చెప్పారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలు సాగు, తాగు నీటి కోసం కృష్ణా జలాలను ఏమేరకు వినియోగిస్తున్నాయో కేఆర్‌ఎంబీ ఎప్పటికప్పుడు లెక్క కడుతుందని అన్నారు. కేఆర్‌ఎంబీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు.