ఏపీలో సచివాలయాల పనితీరు భేష్, కానీ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది వ్యవహారమే అంతు చిక్కకుండా ఉంది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ఇంకా 50 శాతం మంది కూడా సరిగ్గా సమయానికి సచివాలయాలకు రాని పరిస్థితి.
మిగతా వారంతా ఆన్ డ్యూటీ అంటూ రిజిస్టర్ లో రాసి వెళ్తున్నారు. దీనికిప్పుడు బ్రేక్ వేయాలని చూస్తోంది సీఎంఓ కార్యాలయం. సచివాలయ ఉద్యోగుల హాజరు ఈ రోజు నుంచి 90 శాతం ఉండాలని, అలా లేని పక్షంలో ఎంపీడీవోలని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది.
హాజరు కోసం అన్ని కష్టాలెందుకు..?
గ్రామ, వార్డు సచివాలయాల కోసం కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వారంతా ఉదయం, సాయంత్రం అటెండెన్స్ వేసుకునే బయటపడేవారు. కానీ అప్పటికే సీనియర్లు అయిన వీఆర్వోలు, గ్రేడ్-2 పంచాయతి సెక్రటరీలు, ఏఎన్ఎం లు.. మాత్రం ఆన్ డ్యూటీ అంటూ సచివాలయాలకు మొహం చాటేసేవారు.
నిజంగా వేరే పని ఉంటే ఓకే, కానీ పనిలేకపోయినా ఆన్ డ్యూటీ అనే పదం అలవాటు చేసుకున్నారు. ఇటీవల మహిళా కానిస్టేబుళ్లు (మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి) కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, అక్కడి డ్యూటీలు చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో కొత్త రిక్రూటీలు కూడా కాలరెగరేస్తున్నారు. అందరూ ఆన్ డ్యూటీ అనేస్తూ సచివాలయాలకు మొహం చాటేస్తున్నారు.
క్రమశిక్షణ అత్యవసరం..
ఊరిలో సచివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ మినహా ఇంకెవరూ కనిపించరు. దీంతో ఇటీవల కాలంలో సచివాలయాలపై చాలా కంప్లయింట్లు వచ్చాయి. పట్టణాల్లో ఉండే వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు బాగానే అమలవుతోంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సీఎం ఆఫీస్ నేరుగా జోక్యం చేసుకుంది.
జులై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలిస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రెండోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి బయెమెట్రిక్ హాజరుతోనే జీతాలని తెగేసి చెప్పేశారు. ఆన్ డ్యూటీ పేరుతో ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే వీఆర్వోలకు, ఊరిలోనే ఉండిపోయే ఏఎన్ఎంలకు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న మహిళా కానిస్టేబుళ్లకు డిప్యుటేషన్లు రద్దు చేశారు.
అందరూ కచ్చితంగా సచివాలయానికి రావాలని, ఆ తర్వాత ఎక్కడైనా పనులుంటే వెళ్లి రావాలని, సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కూడా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశాలిచ్చారు. ఈసారైనా బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలవుతుందో లేదో చూడాలి.