వైఎస్ఆర్ మంత్ర: షర్మిలకు ప్లస్ ఇదే-మైనస్సూ ఇదే

“రాజన్న రాజ్యం తెస్తా. వైఎస్ఆర్ కలల రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తా. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..” తెలంగాణలో షర్మిల స్టేట్ మెంట్స్ ఇలా సాగుతున్నాయి. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ రాజకీయ పునాదులపై…

“రాజన్న రాజ్యం తెస్తా. వైఎస్ఆర్ కలల రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తా. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..” తెలంగాణలో షర్మిల స్టేట్ మెంట్స్ ఇలా సాగుతున్నాయి. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ రాజకీయ పునాదులపై నిర్మించాలని అనుకుంటున్నారు షర్మిల. అందులో తప్పులేదు.

ఓ ముఖ్యమంత్రి తనయగా షర్మిలకు ఆ విషయంలో పూర్తి హక్కు ఉంది. కానీ అదే సమయంలో పూర్తిగా ''వైఎస్ఆర్ మంత్ర''పై ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్.

ఇది ఏపీ కాదు.. తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఓ శిఖరం. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలక్కర్లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం వైఎస్ఆర్ ను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. అలాంటి వైఎస్ఆర్ రాజ్యాన్ని స్థాపిస్తానంటూ జగన్ బాగానే జనాల్ని ఎట్రాక్ట్ చేశారు. అనుకున్నది సాధించారు. ప్రస్తుతం ఆ దిశగానే తన పాలనను కూడా సాగిస్తున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి పూర్తిగా భిన్నం. 

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ ను ప్రజలు మరిచిపోయారో లేదో చెప్పలేం కానీ, పార్టీ మాత్రం మరిచిపోయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో (వైఎస్ఆర్ మరణం తర్వాత) వైసీపీకి అతి తక్కువ సీట్లు వచ్చాయి. 3 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం మాత్రమే గెలుచుకుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి వైసీపీకి. ఆ తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి రాజకీయంగా వైసీపీ పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టయింది.

గత ఎన్నికల్లో అస్సలు పోటీనే చేయలేదు. ఇలాంటి టైమ్ లో క్యాడర్ ఇంకా ఉందని పైకి చెప్పే మాట అభూతకల్పనే అవుతుంది. వైఎస్ఆర్ సానుభూతిపరులు ఉండొచ్చేమో కానీ, వైసీపీ కార్యకర్తలు దొరకడం కష్టమే.

తెలంగాణకు వైఎస్ఆర్ హీరోనా.. విలనా..?

“ఆయనే ఉంటే ఆంధ్రప్రదేశ్ ముక్కలు చెక్కలయ్యేది కాదు.” ఈ డైలాగ్ ఇప్పటికీ చాలామంది వాడారు, వాడుతూనే ఉన్నారు. ఇటీవల వైసీపీ నేతలు కూడా జలజగడంలో ఈ డైలాగులు కొట్టారు. వైఎస్ఆర్ ఉంటే ఏపీ విభజన జరిగేది కాదు.

అంటే విభజనను వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రజలకు ఆయన హీరో అయితే, తెలంగాణ వాసులకు ఆయన విలనే కదా. అందుకే టీఆర్ఎస్ మొదట్లో షర్మిలను పెద్దగా పట్టించుకోలేదు. తండ్రి వైఎస్ఆర్ పేరు చెప్పినంత కాలం షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరించరనేది వారి ఆలోచన.

అయితే షర్మిల తెలివిగా తన తొలి ప్రెస్ మీట్ నుంచీ తెలంగాణకు వైఎస్ఆర్ వ్యతిరేకం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో చేసిన తీర్మానాలను ప్రస్తావిస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఎత్తుకున్నారు. ఆ ముద్ర పూర్తిగా తొలగించుకోగలిగితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అయినట్టే.

కేసీఆర్ జమానాలో వైఎస్ఆర్ ఎక్కడ?

ఏపీలో 'వైఎస్ఆర్' ఎలిమెంట్ ను సజీవంగా ఉంచగలిగారు జగన్. 2014 ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ఆర్ మంత్ర బాగా పనిచేసింది. సరిగ్గా ఇదే పని తెలంగాణలో జరగలేదు. ఏపీపై తీవ్రంగా దృష్టిపెట్టిన జగన్, పొరుగు రాష్ట్రాన్ని, అక్కడి రాజకీయాల్ని పట్టించుకోలేదు. ఫలితంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ''వైఎస్ఆర్ ఎలిమెంట్'' అనేది విగ్రహాలకే పరిమితమైంది తప్ప, రాజకీయాలకు విస్తరించలేదు.

దీనికితోడు వైఎస్ఆర్ ను మరిపించేలా కేసీఆర్ పూర్తిగా రాష్ట్రాన్ని గులాబీమయం చేశారు. కాంగ్రెస్ ను ఎలాగైతే చీల్చి పబ్లిక్ గా టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారో, తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ ను మరిచిపోయేలా ప్రైవేటుగా తెరవెనక అంతే చాకచక్యంగా వ్యవహరించారు కూడా.

పునాది లేదు.. ఇటుకలే మిగిలాయి..

ఇలాంటి టైమ్ లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్ఆర్ జపం చేస్తున్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానంటున్నారు. నిజానికి వైఎస్ఆర్ పునాదులపై షర్మిల తన పార్టీని నడిపిస్తారనేది అపోహ మాత్రమే.

ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీకి పునాది లేదు. ఇటుకలు మాత్రమే మిగిలాయి. ఆ ఇటుకలతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత షర్మిలదే. ఇదేమంత చిన్న విషయం కాదు.

ఈ సంగతి పక్కనపెడితే.. తెలంగాణలో వైఎస్ఆర్ ప్రభ ఇంకా ఉందా లేదా అనే విషయాన్ని కూడా షర్మిల తొందరగా పసిగట్టాలి. అందుకు తగ్గట్టు తన వ్యూహాలు, రాజకీయ సమీకరణాలు మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి మనుగడ. రాబోయే రెండేళ్లలో ఈ దిశగా షర్మిల ఎంత వేగంగా అడుగులు వేస్తే అంత మంచిది.