అక్క‌డ మాట‌ల్లేవ్‌…మాట్లాడుకోడాల్లేవ్‌!

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కుంది. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ముఖ్య నేత‌ల మ‌ధ్య సంబంధాలు… మాట‌ల్లేవ్‌, మాట్లాడుకోడాల్లేవ్ అనే డైలాగ్‌ను గుర్తు చేస్తున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున…

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కుంది. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ముఖ్య నేత‌ల మ‌ధ్య సంబంధాలు… మాట‌ల్లేవ్‌, మాట్లాడుకోడాల్లేవ్ అనే డైలాగ్‌ను గుర్తు చేస్తున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున మ‌ల్లెల లింగారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్థానంలో నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉక్కు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం నియ‌మించింది. దీంతో లింగారెడ్డి అల‌క‌బూనారు. 

టీడీపీ క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల్ని లింగారెడ్డికి అప్ప‌గించారు. కేవ‌లం ఇది కంటితుడుపు నియామ‌కంగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంత వ‌ర‌కూ లింగారెడ్డి తిరిగిన దాఖ‌లాలు లేవు. ఆయ‌న ప్రొద్దుటూరులో నివాసం ఉంటుండడంతో, అక్క‌డే ప్రెస్‌మీట్లు పెడుతూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. 

మ‌రో వైపు ప్రొద్దుటూరు టీడీపీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌త పూర్తిగా కొర‌వ‌డింది. దీంతో ఉక్కు ప్ర‌వీణ్‌, లింగారెడ్డి ఎవ‌రికి వారుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. లింగారెడ్డి కార్య‌క్ర‌మాల‌కు ఏ ఒక్క టీడీపీ నేత వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ టికెట్ ప్ర‌వీణ్‌కే అని అధిష్టానం ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డంతో, ఆయ‌న వ‌ద్ద‌కే పార్టీ శ్రేణులు వెళుతున్నాయి.

ప‌ట్ట‌ణంలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా ప్ర‌వీణ్‌తోనే ఉంటోంద‌ని చెబుతున్నారు. మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్‌ ముక్తియార్‌, ప‌ట్ట‌ణ నాయ‌కుడు ఈవీ సుధాక‌ర్‌రెడ్డి ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్ల‌డం లేదు. ప్ర‌వీణ్‌కు అనుకూలంగా ఉన్నార‌నే స‌మాచారం. దీంతో లింగా రెడ్డి, ప్ర‌వీణ్ అస‌లు మాట్లాడుకునే ప‌రిస్థితే లేదు. 

ఇలాగైతే పార్టీ ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో కోలుకునేదెట్టా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో అంత‌ర్గ‌త పోరు ప‌తాక స్థాయికి చేరింద‌ని చెప్పొచ్చు. దీన్ని అధిష్టానం ఎలా అధిగ‌మిస్తుందో చూడాల్సిందే.