ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజా వేదికను నేలమట్టం చేసే దిశగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రెండు రోజులపాటు ఇదే వేదికలో కలెక్టర్ల సదస్సుని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వహించిన విషయం విదితమే. చంద్రబాబు హయాంలో నిర్మితమైన ప్రజా వేదిక అక్రమ కట్టడమనీ, ఈ నేపథ్యంలో దాన్ని కూల్చేయాల్సిందేనని అధికారుల్ని ఆదేశించారు వైఎస్ జగన్. కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చివేత పనులు ప్రారంభించాలని వైఎస్ జగన్ ఆదేశించిన దరిమిలా, ఈ రోజు సాయంత్రం సదస్సు పూర్తి కాగానే.. కూల్చివేతలు మొదలయ్యాయి.
తరలించడానికి వీలున్న సామాగ్రిని తొలుత వాహనాల్లో తరలించిన అధికారులు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రహరీని మొదలుకొని, మొత్తంగా కట్టడాన్ని నేలమల్టం చేసే దిశగా అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. రాత్రికి రాత్రే మొత్తంగా ప్రజా వేదిక కూల్చివేత పూర్తయిపోతుందని పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. అయితే, కూల్చివేత మొదలు పెట్టామనీ, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు.
కృష్ణా నదికి ఆనుకుని వున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అద్దెకు తీసుకున్న విషయం విదితమే. ముఖ్యమంత్రిగా దాన్నే అధికారిక నివాసంగా చేసుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత, తన నివాసానికి పక్కనే ప్రజా వేదికను ప్రభుత్వ ధనంతో నిర్మించి.. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఈ నిర్మాణం కోసం అడ్గగోలుగా ఖర్చు చేశారంటూ అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆరోపించింది. ప్రజా వేదికతోపాటు, చంద్రబాబు నివాసమూ అక్రమ కట్టడమేనంటూ న్యాయస్థానాన్ని సైతం వైసీపీ ఆశ్రయించిన విషయం విదితమే.
ముఖ్యమంత్రి పదవి పోయాక, చంద్రబాబు తనకు ప్రజా వేదికను కేటాయించాలంటూ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. అయితే, ఆ లేఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ప్రజా వేదిక అక్రమ నిర్మాణం.. అని గతంలో తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నామంటూ, వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి హోదాలో ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడం.. ఆ కూల్చివేత ప్రారంభమవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయ్.
విదేశాల నుంచి తిరిగొస్తున్న చంద్రబాబు, ప్రజా వేదిక విషయంలో చేయబోయే గగ్గోలు ఎలా వుంటుందో మరి.!