ఆ రాష్ట్రంలో సెకెండ్ వేవ్ పూర్తి నియంత్ర‌ణ‌లోకి!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఎంత‌లా అంటే.. ప్ర‌స్తుతం క‌రోనా డైలీ బులిటెన్ ను కూడా విడుద‌ల చేయ‌డాన్ని ఆపేసింది అక్క‌డి ప్ర‌భుత్వం.…

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఎంత‌లా అంటే.. ప్ర‌స్తుతం క‌రోనా డైలీ బులిటెన్ ను కూడా విడుద‌ల చేయ‌డాన్ని ఆపేసింది అక్క‌డి ప్ర‌భుత్వం. కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతూ ఉన్న ప‌రిస్థితుల్లో డైలీ బులెటెన్ విడుద‌ల చేయ‌డం అవ‌స‌రం, అయితే ఇప్పుడు ఢిల్లీలో కేసుల సంఖ్య డ‌బుల్ డిజిట్ స్థాయిలోకి రావ‌డంతో బ‌హుశా ఇక రోజువారీగా కేసుల సంఖ్య‌ను చెబుతూ ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయాల్సిన అవ‌స‌రం త‌గ్గిపోతోంది.  

గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో ఢిల్లీలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 77గా తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన అక్క‌డ కేవ‌లం 44 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఢిల్లీలో యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 683గా ఉంది. క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి నియంత్రణ‌లో ఉన్న రాష్ట్రంగా ఢిల్లీని ఇప్పుడు చెప్ప‌వ‌చ్చు. జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్రాంత‌మే అయినా.. ఢిల్లీలో క‌రోనా నియంత్ర‌ణ‌లోకి రావ‌డం సానుకూల‌మైన ప‌రిణామం. దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అయిన ప్రాంతం కూడా ఇదే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో క‌రోనా కేసుల‌తో ఢిల్లీ అట్టుడికింది.

ఏప్రిల్ 20 వ‌తేదీన ఏకంగా 28,395 కేసులు న‌మోద‌య్యాయి. అది ప‌తాక స్థాయి. ఏప్రిల్ 22వ తేదీన పాజిటివిటీ రేటు 36.2గా న‌మోదైంది. మే నెల నుంచి అక్క‌డ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. మే మూడో తేదీన ఢిల్లీలో క‌రోనా కార‌ణంగా అత్య‌ధిక స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఆ నంబ‌ర్ ఏకంగా 448గా రికార్డు అయ్యింది.

ప్ర‌స్తుతం అక్క‌డ పాజిటివిటీ రేటు 0.11 మాత్ర‌మే. గ‌మించాల్సిన మ‌రో ముఖ్య‌మైన అంశం ఏమిటంటే.. ఢిల్లీలో క‌రోనా కేసులు ప‌తాక స్థాయిలో న‌మోదైన‌ప్పుడే మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో కూడా అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. అయితే కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌ల్లో ఇప్ప‌టికీ క‌రోనా పూర్తి నియంత్ర‌ణ‌లోకి రావ‌డం లేదు.

గ‌త ప‌క్షం రోజులుగా అక్క‌డ యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం ఎలా ఉన్నా.. స్వ‌ల్పంగా పెర‌గ‌డం లేదా, స్ట‌డీగా కొన‌సాగ‌డం జ‌రుగుతోంది. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికీ ల‌క్ష‌కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేర‌ళలో కూడా ల‌క్ష‌కు పై స్థాయిలోనే యాక్టివ్ కేసులున్నాయి. ప్ర‌స్తుతానికి అయితే ఢిల్లీ అయినా కుదుట‌ప‌డం ఊర‌ట‌ను ఇచ్చే అంశం.