మాట‌లు కాదు… వైసీపీ చేత‌ల్లో చూపాలి!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై మోడీ స‌ర్కార్ ముందుకెళ్ల‌డం ఏపీ పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా ఉంది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీతో స‌హా అన్ని రాజ‌కీయ ప‌క్షాలు తాము విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్య‌తిరేక‌మ‌నే చెబుతున్నాయి.…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై మోడీ స‌ర్కార్ ముందుకెళ్ల‌డం ఏపీ పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా ఉంది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీతో స‌హా అన్ని రాజ‌కీయ ప‌క్షాలు తాము విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్య‌తిరేక‌మ‌నే చెబుతున్నాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు బీజేపీ నేతృత్వంలోని మోడీ స‌ర్కార్ శ‌ర‌వేగంగా పావులు క‌దుపుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

ఇదే స‌మయంలో రాజ‌కీయంగా పైచేయి సాధించ‌డానికి ఎవ‌రికి వారుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పావుగా వాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యం లో తాము విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేక‌మ‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశ రాజ‌ధాని ఢిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైసీపీ సంఘీభావం తెలిపింది. అలాగే విశాఖలో కార్మిక సంఘాలతో బుధ‌వారం ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాల‌ని కార్మిక సంఘాలు వైసీపీ ఎంపీల‌ను ఈ సంద‌ర్భంగా కోరాయి.

కార్మిక సంఘాల నాయ‌కుల‌తో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో ఉంద‌నే సాకు చూపి విక్ర‌యిస్తామంటే వ్య‌తిరేకిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం సొంత గనులు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

స్టీల్ ప్లాంట్‌కు బ‌య‌టి రాష్ట్రాల గ‌నులు కోర‌డం లేద‌న్నారు. మన రాష్ట్ర సరిహద్దు కోటియాలో గనులు ఉన్నాయని గుర్తు చేశారు. దీనిపై ఉక్కు శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిని కలిసి ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు బీజేపేత‌ర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామ‌న్నారు. అయితే వైసీపీ నేత‌లు హామీలు, అడ్డుకుంటామ‌నే మాట‌లు చెప్ప‌డంతో బాధ్య‌త తీరిపోయింద‌ని అనుకోవ‌ద్ద‌ని కార్మిక సంఘాల నాయ‌కులు కోరుతున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అడ్డుకునేందుకు వైసీపీ ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు కార్యాచ‌ర‌ణ‌కు దిగితేనే మోడీ స‌ర్కార్ దిగి వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కావున మాట‌ల‌తో మోడీ స‌ర్కార్ వినే ర‌కం కాద‌ని, వైసీపీ త‌మ చిత్త‌శుద్ధిని చేత‌ల్లో చూపాల‌ని ఏపీ స‌మాజం కోరుతోంది.