హీరోయిన్ గా తన తొట్ట తొలి సినిమా కూలీ నంబర్-1 విడుదలను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంది నటి టబు. ఆ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమె ఇన్ స్టాలో ఒక ప్రత్యేక పోస్టు పెట్టింది. బాల నటిగా కొన్ని సినిమాల్లో చేసినట్టుగా ఉంది టబు.
అయితే హీరోయిన్ గా పరిచయం అయ్యింది కూలీ నంబర్ వన్ సినిమాతోనే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. హీరోయిన్ గా టబుకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. అప్పటికే టబు సోదరి ఫర్హా కూడా వెంకటేష్ సరసన నటించింది.
హీరోయిన్ గా 30 యేళ్ల కెరీర్ పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్నట్టుగా ఉందని టబు స్పందించింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని అంది. కూలీ నంబర్ వన్ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన రామానాయుడు, సురేష్ నాయుడు, వెంకటేష్ నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు అని టబు తన పోస్టులో పేర్కొంది.
తన కెరీర్ కు ఆ సినిమా ఒక సాలిడ్ ఫౌండేషన్ అని పేర్కొందది. తనను పాపా అంటూ పిలుచుకునే దర్శకుడు, తన గురువు రాఘవేంద్రరావు తనను ఒక స్వప్నంలా తెరపై ఆవిష్కరించాడని టబు చెప్పుకొచ్చింది.
ఆయన తనకు ఎన్నో నేర్పించాడని మానవత్వం గురించి, అందం గురించి, సమయానికి ఉన్న విలువ గురించి, జీవితాన్ని ఆస్వాధించడం గురించి రాఘవేంద్రరావు తనకు మరిచిపోలేని పాఠాలను నేర్పించాడంటూ టబు చెప్పుకొచ్చింది.
థ్యాంక్యూ గురువుగారు అని రాఘవేంద్రరావుకు ప్రణామాలు తెలిపింది టబు. ఆయనకు తనెంతో రుణపడినట్టుగా చెప్పింది. తన నటనా ప్రయాణంలో తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని టబు చెప్పింది.