హీరోయిన్లు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? టైమ్ దొరికితే విహార యాత్రలకు వెళ్తారు. అక్కడ్నుంచి అందమైన ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ తాప్సి మాత్రం అలా కాదంటోంది. తనకు ఫ్రీ టైమ్ దొరికితే ఇంట్లోనే కూర్చుంటానంటోంది.
“ఖాళీ సమయంలో నా లైఫ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఉదయాన్నే లేవడం నాకిష్టం. ఎందుకంటే సూర్యోదయాలంటే నాకు ఇష్టం. నన్ను పొద్దున్నే నిద్రలేచేలా చేసేవి సూర్యోదయాలే. లేచిన వెంటనే గ్రౌండ్ లో ఏదో ఒక ఆట ఆడడానికి ప్రయత్నిస్తాను. లేదంటే జిమ్ చేస్తాను. షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇది తప్పనిసరి.”
జిమ్ పూర్తయిన తర్వాత ఎలాంటి పనులు పెట్టుకోదట తాప్సి. ఖాళీగా అలా ఇంట్లోనే ఉంటుందట. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో జాలీగా టైమ్ గడిపేస్తుందట. అలా నలుగురితో కలిసి ఉండడం వల్ల, స్టార్ అనే భావన పోతుందని, లైఫ్ లో ప్రాక్టికల్ గా ఉండడం అలవాటు అవుతుందని చెప్పుకొచ్చింది.
“షూటింగ్ లేకపోతే, వ్యాయామం పూర్తయిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోతాను. కుటుంబంతోనే గడుపుతాను. ఎక్కువగా నా చెల్లెలితో గడుపుతాను. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లకు సినిమా ఫీల్డ్ తో సంబంధం లేదు. అంతా కలిసి జాలీగా ఎటైనా వెళ్తాం. లేదంటే ఇంట్లోనే గడుపుతాం. కలిసి తింటాం, సినిమాలు చూస్తాం.”
ప్రత్యేకంగా తనకు ఎలాంటి డైట్ సీక్రెట్స్ లేవంటోంది తాప్సి. సగటు నార్త్ ఇండియన్ అమ్మాయి తినే అన్ని వంటకాలు తింటానని, ఇంట్లో వండిన భోజనం తినడమే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.