దేశంలోని కొన్ని హైకోర్టులు తరచూ ఉన్నతాధికారులను కోర్టులకు పిలిపించడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. అంతేకాదు, అలాంటి ధోరణిని ఖండిస్తున్నట్టు కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. అవసరం ఉన్నా, లేకపోయినా ఉన్నతాధికారులను న్యాయస్థానాలకు రప్పించే న్యాయమూర్తుల వైఖరిపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.
‘అధికారులు తక్షణం హాజరు కావాలంటూ హుకుం జారీ చేయటం… తద్వారా వారిపై ఒత్తిడి పెంచటమనే ప్రక్రియ కొన్ని హైకోర్టు లకు అలవాటైపోయింది. కొన్ని న్యాయస్థానాలు తమకు నచ్చినట్టుగా అధికారులు పని చేయాలనే ఉద్దేశంతో వారిని ఒత్తిడి చేస్తున్నాయి. న్యాయవ్యవస్థకు– కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండే అధికారపు అధీన రేఖను దాటాలని చూస్తున్నాయి’
‘న్యాయమూర్తులు వినయ విధేయతలతో మెలగాలి. వాళ్లేమీ చక్రవర్తులు కారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మూడింటికీ ఎవరి పరిధులు వారికున్నాయి. ఒకరి అధికారాల్లోకి మరొకరు చొచ్చుకురావాలనుకోవటం సరికాదు. అలా చేస్తే రాజ్యాంగ సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితం అనుభవించాల్సి వస్తుంది’
‘కోర్టులకు ప్రభుత్వాధికారుల్ని అనవసరంగా పిలవవద్దని మరోసారి చెబుతున్నాం. వాళ్లనలా పిలవటం వల్ల మీ గౌరవమేమీ పెరిగిపోదు. కోర్టుల పట్ల గౌరవాన్ని సంపాదించుకోవాలి తప్ప ఆపాదించుకోకూడదు. ఒక అధికారి కోర్టుకు వచ్చాడంటే తన అవసరం ఉన్న మరో పని ఆగిపోతుందని గమనించండి. కొన్నిసార్లు కోర్టు పిలుపుల కోసం అధికారులు దూరాభారాలు ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి అధికారుల్ని పిలవటమనేది ప్రజాహితానికి వ్యతిరేకం. అధికారులు రాకున్నా… దాన్ని మించిన కలం కోర్టుల చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించండి’ అని ధర్మాసనం పేర్కొంది.
ఆలోచన లేకుండా, తరచుగా అధికారులను కోర్టులకు పిలవటాన్ని ఎంతమాత్రం హర్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా కిందికోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.