తన మాటను ధిక్కరించి తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన చెల్లి షర్మిల, ఆమెకు అండగా నిలిచిన తల్లి వైఎస్ విజయమ్మపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
తల్లి, చెల్లిపై జగన్ కోపంగా ఉన్నారనేందుకు ఆయన మానస పుత్రికే నిలువెత్తు “సాక్షి”. ప్రస్తుతం సాక్షి మీడియా సంస్థకు జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద సతీమణి విజయమ్మ, తనయ షర్మిల నిన్న ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన భార్య భారతితో కలిసి నివాళి అర్పించారు.
తల్లి, చెల్లి కలిసి వైఎస్సార్‌కు నివాళికి సంబంధించి సాక్షిలో వార్త లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని సమాచారం. సాక్షి ప్రధాన పత్రికలోనూ, చివరికి జిల్లా సంచికలో కూడా దివంగత వైఎస్సార్‌కు విజయమ్మ, షర్మిల నివాళి వార్త రాకపో వడం వెనుక జగన్ మనసెరిగి నడుచుకున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
వైఎస్సార్‌కు విజయమ్మ, షర్మిల నివాళికి సంబంధించి ఎల్లో మీడియాలో ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మరోవైపు నిన్నటి పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ఆంధ్ర జ్యోతికి ఫుల్ పేజీ అడ్వర్‌టైజ్‌మెంట్ ఇవ్వడం, సాక్షికి ఇవ్వకపోవడంతో అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయమ్మ, షర్మిల నివాళులకు సంబంధించి మూడు ప్రధాన పత్రికలో ఏ విధంగా వార్త వచ్చిందో చూద్దాం.
సాక్షి మొదటి పేజీలో వైఎస్ జగన్ నివాళులర్పించే పెద్ద ఫొటో ప్రచురించారు. అలాగే లోపలి పేజీలో వైఎస్సార్‌కు ఘన నివాళి శీర్షికతో వార్త ఇచ్చారు. ఇందులో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి , కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించినట్టు రాసు కొచ్చారు. తండ్రిని స్మరించుకునే సమయంలో ముఖ్యమంత్రి ఒకింత చెమర్చిన కళ్లతో కనిపించారని కూడా రాశారు.
అలాగే తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలోనూ, ఢిల్లీలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ 72వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వార్త, ఫొటోలు క్యారీ చేశారు. కానీ వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులకు సంబంధించి భూతద్దం పెట్టి వెతికినా వార్త, ఫొటో కనిపించక పోవడం వైసీపీ శ్రేణుల్ని, ఏపీ ప్రజానీకాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు మెయిన్ మొదటి పేజీలో వైఎస్‌కు విడివిడిగా నివాళులంటూ ఇండికేషన్ ఇచ్చి, వార్తను లోపలి పేజీలో క్యారీ చేశారు. అలాగే జగన్ నివాళులర్పించే ఫొటో మాత్రమే వాడారు. అయితే ఈనాడు కడప టాబ్లాయిడ్ ఫస్ట్ పేజీలో షర్మిల, విజయమ్మ నివాళి వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
“జెండా ఉంచి…నివాళి అర్పించి” అనే శీర్షికతో ఫొటో, రైటప్ ఇచ్చారు. “దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన సతీమణి , వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వారి కుమార్తె షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఘాట్ వద్ద వైఎస్ఆర్‌టీపీ జెండాను ఉంచారు” అని రెండు వాక్యాల్లో నేరుగా సమాచారం ఇచ్చారు.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్తే… మెయిన్ పేజీలో విడివిడిగా నివాళులు శీర్షికతో వార్త ఇచ్చారు. ఈ వార్తకు వైఎస్ జగన్‌తో పాటు ఆయన తల్లి, చెల్లి వేర్వేరుగా నివాళులర్పించే ఫొటోలు కూడా వాడడం విశేషం. నివాళి సందర్భంగా షర్మిల వెంటే కుటుంబ సభ్యులు ఉన్నట్టు ఆంధ్రజ్యోతిలో రాయడం గమనార్హం.
వ్యక్తిగత విభేదాలతో చివరికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలకు కూడా సాక్షి దినపత్రికలో చోటు దక్కకపోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. రక్తసంబంధాలు, బంధాలు, అనుబంధాల కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా? అనే నిట్టూర్పులు విడుస్తున్నారు. అసలు జగన్ ఫ్యామిలీలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇడుపులపాయలో వైఎస్సార్‌కు విజయమ్మ, షర్మిల నివాళి అర్పించడానికి సంబంధించి సాక్షిలో వార్త, ఫొటో రాకపోవడం… తల్లికూతురికి జరిగిన ఘోర అవమానంగా పౌరసమాజం భావిస్తోంది. ఈ పరిణామాలు మున్ముందుకు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉందని చెప్పక తప్పదు.