ఉక్కుని మింగేయడానికి వడివడిగా అడుగులు… ?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవడానికి వేగంగానే అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో పూర్వ రంగం సిద్ధమైపోయింది. విశాఖ ఉక్కు మా హక్కు అంటూ నినదించిన వారి గొంతుకలు ఓ వైపు వినిపిస్తున్నా…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవడానికి వేగంగానే అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో పూర్వ రంగం సిద్ధమైపోయింది. విశాఖ ఉక్కు మా హక్కు అంటూ నినదించిన వారి గొంతుకలు ఓ వైపు వినిపిస్తున్నా చెవికెక్కించుకోకుండా కాగల కార్యాన్ని పెద్దలు  చకచకా జరిపించేస్తున్నారు.

ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ దూకుడుగా ఉంది. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేసే మహత్తర క్రతువుని జరిపించేందుకు సలహాదారులను కూడా నియమించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సలహాదారులే ప్రైవేటీకరణ లావాదేవీలను మొత్తం నడిపిస్తారని అంటున్నారు. 

ఇదిలా ఉండగా ఉక్కు మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ విభాగం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర సంబంధిత విభాగాలకు చెందిన అధికారులతో ఈ మధ్యనే కీలక సమావేశం జరిగిందని తెలుస్తోంది.

ఈ సమావేశం వివరాలు బయటకు రానప్పటికీ ప్రైవేటీకరణ దిశగానే సమాలోచనలు సాగించారని చెబుతున్నారు. ఈ సమాచారంతో విశాఖ ఉక్కు కార్మికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీ మొత్తం వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఉక్కు మీద ప్రైవేట్  వేటు వేయడానికే రెడీ అవడం పట్ల మండిపోతున్నారు. అయితే ఈ ఆందోళనలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి. 

విశాఖ సముద్రం సాక్షిగా విశాఖ ఉక్కుని మింగేయడానికి ప్రయత్నాలు మాత్రం పూర్తిగా జోరందుకున్నాయి. మరి కేంద్రం దూకుడుకు బ్రేక్ వేయడం ఈ సమయంలో జరగని పని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బలిపీఠం మీద ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడడం ఎవరి వల్లా కాదని తేలిపోతోంది. 

కేంద్రం పంతం ప్లాంట్ అంతం చూసేలాగే ఉందని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఉక్కు చరిత్రలోనే మహా విషాద ఘట్టానికి ఆవిష్కరణ త్వరలోనే జరగబోతోందా అంటే అవును అన్న మాటే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.