ఎవరి ‘సెక్స్’? ఎవరికి నొప్పి?

‘సెక్స్ అండ్ రొమాన్స్’ సేలబిలిటీ ఉన్న చాలా గొప్ప సబ్జెక్టు.  Advertisement ‘సేలబిలిటీ’ అనే పదం చుట్టూతానే ‘మార్కెట్’ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ‘మార్కెట్’ చుట్టూతా ‘దేశం’ తిరుగుతూ ఉంటుంది. దేశమంటే మట్టి కాదు…

‘సెక్స్ అండ్ రొమాన్స్’ సేలబిలిటీ ఉన్న చాలా గొప్ప సబ్జెక్టు. 

‘సేలబిలిటీ’ అనే పదం చుట్టూతానే ‘మార్కెట్’ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది.

‘మార్కెట్’ చుట్టూతా ‘దేశం’ తిరుగుతూ ఉంటుంది.

దేశమంటే మట్టి కాదు కదా.. ‘మనుషులు’ మన గురజాడ వారు చెప్పారు. 

సో, మనుషులందరూ.. ఏ సబ్జెక్టు చుట్టూ తిరుగుతున్నారన్నమాట??

‘సెక్స్ అండ్ రొమాన్స్’ కనీసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యవహారం. ఇద్దరూ ఇష్టపడినంత వరకూ, అందులో ఇతరులకు అభ్యంతరాలు ఏమిటి? ఎందుకు? ఆ ఇద్దరిలో, ఏ ఒక్కరికో ఇష్టం లేకపోయినా బలవంతం చేసినా, వేధించినా, బెదిరించినా అప్పుడు మాత్రమే అది నేరం. అలాంటి నేరం మాత్రమే పబ్లిక్ ఎఫైర్! అవేమీ లేనప్పుడు ఏం జరిగితే మాత్రం, అందులో మరొకరి జోక్యం ఎందుకు? మరొకరి ఏడుపు ఏమిటి?

ఖర్మ ఏంటంటే.. సెక్స్ టాపిక్ దొరికితే చాలు.. ప్రజలను, వారి కష్టాలను గాలికొదిలేసి.. రాజకీయం కూడా మొత్తం దాని చుట్టూతానే తిరుగుతోంది. 

ముందుగా మనం కొంచెం వెనక్కు వెళ్లాలి. సుమారు మూడేళ్లు వెనక్కి. వివాహేతర (అక్రమ) లైంగిక సంబంధాలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 497 ను సుప్రీం కోర్టు రద్దు చేసేసింది. ఆ సెక్షన్ రద్దు తర్వాత.. అక్రమ సంబంధాలు, ఇష్టపూర్వకంగా ఇద్దరి మధ్య జరిగే ఎలాంటి సెక్స్ కు సంబంధించి అయినా ‘నేరం’ గా నిర్వచించడానికిన ఏమీ మిగల్లేదు. ఒక మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెతో సెక్స్ లో పాల్గొంటే.. లైంగికంగా వేధిస్తే, అలాంటి వేధింపుల కిందికి వచ్చేవి మాత్రమే నేరాలు.

స్త్రీ పురుషుల మధ్య ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్ నేరం కాదు. సుప్రీం ఈ విషయాన్ని సెక్షన్ 497 రద్దు ద్వారా ధ్రువీకరించింది. ఇదేమీ అదాటును వచ్చేసిన తీర్పు కూడా కాదు. సెక్షన్ 497 అనేది మహిళల స్వేచ్ఛను, ఇష్టాన్ని తొక్కేస్తున్నాయని, స్త్రీని బానిసగా మార్చేస్తున్నాయని ఆరోపిస్తూ.. మహిళా సంఘాలు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా న్యాయపోరాటం సాగించి సాధించుకున్న తీర్పు. 

ఒక్కసారి ఈ తీర్పును మననం చేసుకుని మనం వర్తమాన రాజకీయ పరిణామాలను సాకల్యంగా, కూలంకషంగా పరిశీలిద్దాం. కటువుగా అనిపించినా కొన్ని వాస్తవాలను, వాస్తవిక దృక్పథంతోనే మాట్లాడుకోవడం బాగుంటుంది. 

సెలబ్రిటీ రంగాలు.. సెక్స్ వ్యవహారాలు

‘సెక్స్’ అనేది ఇద్దరి మధ్య ఉండగల అత్యుత్తమ బంధంగా గానీ, ఒక మహిళ, ఒక పురుషుడికి అత్యుత్తమ కానుకగా గానీ, తన పరంగా చేయగలిగిన అత్యుత్తమ త్యాగంగా గానీ.. సామాజిక మూలాలు ఏమైనా సరే.. అలాంటి ముద్ర మన సమాజంలో ఏర్పడింది. అనేకరకాల అపభ్రంశపు పోకడలు అలాగే వచ్చాయి. సాధారణంగా మన సమాజంలో సినిమా, రాజకీయాలు సెలబ్రిటీ రంగాలు అని చెప్పుకోవాలి. ఈ రంగాల్లో అవకాశాలు కోరుకునే మహిళల్లో కొందరు ఈ పద్ధతులను అనుసురించడం ఒక రివాజుగా ఎన్నటినుంచో ఉంది. 

ఇదేమీ మహిళలను కించపరిచే వ్యాఖ్య కాదు! ప్రజాప్రతినిధుల్లో కొందరు నీచులు ఉన్నారన్నంత మాత్రాన.. రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయినట్టు కాదు. అలాగే.. ఈ రంగాల్లోకి ప్రవేశించే కొందరు మహిళలు- తమకు ఉపయోగపడగల వారికి, సెక్స్‌ను ఒక కానుకగా ఆఫర్ చేయడం, ఎరగా వేయడం జరుగుతూనే వస్తోంది. 

ఈ వ్యాఖ్య తప్పయితే.. సినిమా రంగానికి సంబంధించి ‘మీటూ’ అంటూ అనేకానేక ఎపిసోడ్ల సెక్స్ బాగోతాలు.. బయటకు వచ్చేవే కాదు. ‘అవకాశం కోసం నన్ను పడుకోమని అడిగాడు’ అనే ఆరోపణలు మనం బోలెడు వింటుంటాం. దైవవశాత్తూ ‘అవకాశం ఇస్తే చాలు నేను పడుకుంటా’ అని పలానా అమ్మాయి అన్నదంటూ బహిరంగ ఆరోపణలు చేసే మగవాళ్లు మనకు తారసపడడం లేదు. రాజకీయ, సినిమా రంగాలకు ఉండే క్రేజ్ ఎక్కువ కాబట్టి.. ఎంట్రీ కష్టం కాబట్టి.. ఈ అపసవ్య దోరణులన్నీ ఇక్కడే మనకు కనిపిస్తాయి. వీటిని ‘అనైతిక’ అని అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. నీతి అనేదానికి నిర్దిష్టమైన నిర్వచనమే లేదు. అది వ్యక్తుల దృక్పథం మాత్రమే. 

అలా సినీ రాజకీయ రంగాల్లో సెక్స్ ఆఫర్లను ఆమోదించివారు, అలవాటు పడిన వారు, కొత్తగా ఏర్పడిన ఆ బంధాలను కలకాలం కొనసాగించేవారు మనకు అనేకమంది కనిపిస్తుంటారు. బంధం చెడిన కొన్ని సందర్భాల్లో అవి వారి మీద ఆరోపణల రూపంలోకి మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నిజంగానే వేధింపులు, దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. 

వర్తమానంలోకి వద్దాం..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సెక్స్ కు సంబంధించిన ఆరోపణలు ప్రముఖంగా నాలుగు సందర్భాల్లో వినిపించాయి. చిల్లరమల్లరగా రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటివి ఇంకా అనేకం వండి వారుస్తూ ఉంటే వాటి సంగతి అక్కర్లేదు. బాగా ప్రచారంలోకి వచ్చిన నాలుగింటిలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, పృథ్వీ, గోరంట్ల మాధవ్ వ్యవహారాలు ఉన్నాయి. మొదటి మూడు ఆడియో రికార్డింగ్ కు సంబంధించిన వ్యవహారాలు. 

ఈ నాలుగు వ్యవహారాలను కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు ఖండించారు. లేదు కాదు.. వారు తప్పే చేశారు.. వారు దుర్మార్గులు, కీచకులు అని విపక్షాలు సహజంగానే మిన్నంటేలా ఆరోపణలు చేశాయి. ఆ రికార్డింగులు అన్నీ నిజమే అని ఘోషించాయి. 

చర్చ కోసం.. విపక్షాల వాదనలే కరెక్టని అనుకుందాం. రికార్డింగులన్నీ నిజమనే అనుకుందాం. అంబటి, అవంతి వ్యవహారాల్లో.. వారి మాటలు వారికి బాగా పరిచయం ఉన్న.. సెక్స్ అనే వ్యవహారానికి అంగీకరించిన మహిళలతో మాట్లాడుతున్నట్లుగానే సాగిపోయాయి. గోరంట్ల మాధవ్ (వ్యాసరచయిత వైరల్ వీడియో చూడలేదు) వ్యవహారం కూడా అలాంటిదే. ఇది పరిచయం లేని మహిళతో బలవంతంగా చేయగల వీడియో కాల్ కాదు. కాబట్టి.. ఈ మూడు వ్యవహారాల్లో వారికి పరిచయం ఉన్న వారితోనే మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. (ఇది అనుకోవడం మాత్రమే)

అలాంటి సందర్భంలో సదరు మహిళకు, సదరు పురుషుడికి ఇద్దరికీ అంగీకారమే అయినప్పుడు.. మధ్యలో రాజకీయ పక్షాలు విలపిచండం ఎందుకు? సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల ముచ్చట. ఆ ఇద్దరికీ ఇష్టమే అయి మాట్లాడుకుంటే.. ఇతరులు ఎందుకు పెయిన్ భరిస్తున్నారు? నిజానికి మహిళను సెక్స్ కోసం ట్రాప్ చేయడానికి బెదిరించడం, ఇష్టం లేకపోయినా హింసించి ఆ పనిచేయడం జరిగితే.. అలాంటి వారిపట్ల దారుణమైన శిక్షలు ఉండాలి. ఉన్నాయి. ఈ కేసుల్లో వీరు ఎందుకు నిందిస్తున్నారు. 

ఈనాలుగు వ్యవహారాలను గమనించినప్పుడు.. పృధ్వీ కాల్ మాత్రం.. నేరంగా ఎంచదగినది. ఆ ఫోన్ కాల్ సారాంశమే.. సదరు మహిళను ఇష్టానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా సాగుతుంది. పృధ్వీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పార్టీ సమీపానికి కూడా రానివ్వకుండా వెలి వేసింది. అదే పృధ్వీ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడు. జనసేనాని పవన్ కల్యాణ్ భజన చేస్తూ ఆయన పంచన చేరి.. రాజకీయం కొనసాగించాలని అనుకుంటున్నాడు. అదంతా వేరే సంగతి. 

చట్టాలు, వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నప్పటికీ.. నూరుశాతం భ్రష్టుపట్టిపోయిన సమాజంలో మనం బతకడం లేదు. మూడు వ్యవహారాల్లో మహిళల వైపు నుంచి ఎక్కడా ఫిర్యాదు గానీ, ఆరోపణ గానీ రాలేదు. కాల్ రికార్డింగ్ లీక్ కావడం.. దానిని విపక్షాలు రాద్ధాంతం చేయడం మాత్రమే జరుగుతోంది. ఒక కోణంలోంచి చూసినప్పుడు..  వారి చాటు మాటు వ్యవహారాన్ని ఇలా బయటకు ఈడ్చి ఒక మహిళను బజార్న పెట్టడమే హేయం కాదా?

విపక్షాలు ఎందుకిలా చేస్తున్నాయి?

వారి చాటుమాటు వ్యవహారాన్ని రచ్చకీడ్చడం నీచం అని ఆ పని చేస్తున్న వారికి కూడా తెలుసు. కానీ ఎందుకిలా చేస్తున్నారు? వారికి ఓ గొప్ప కారణం ఉంది. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఏ చిన్న దారినీ వారు వదలుకోదల్చుకోవడం లేదు. 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మహిళల భద్రతకోసం అనేక పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అది పూర్తి స్థాయి చట్టరూపం దాల్చకపోయినప్పటికీ.. మహిళల పట్ల జరిగే అకృత్యాలపై పోలీసులు గట్టిగానే స్పందిస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

ప్రభుత్వం చర్యల వల్ల.. మహిళల్లో వారి భద్రత పరంగా ప్రభుత్వం పట్ల ఆదరణ, నమ్మకం పెరుగుతోంది. వ్యక్తుల్లో అపసవ్యపోకడలు ఎప్పుడూ ఉంటాయి. ప్రెవేటు వ్యవహారాలను, బంధాలను ఇక్కడ ప్రస్తావించవద్దు. ప్రభుత్వానికి మహిళల వద్ద ఎలాంటి మంచి పేరు రావడానికి వీల్లేదు. మహిళందరిలో భయంపుట్టించే విషాన్ని ప్రచారం చేయాలి అనేదే వారి లక్ష్యం. అందుకే ఇలాంటి ప్రచారానికి దిగజారుతున్నారు. 

విపక్షాల ఎథికల్ పోలీసింగ్

వేలంటైన్స్ డే నాడు కొన్న వర్గాల సోషల్ పోలీసింగ్ శృతిమించి సాగుతూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయి… వారు ఫ్రెండ్స్ అయినా సరే.. బయటకనిపిస్తే.. వారికి తాళిబొట్టు కట్టించిన ధూర్తులు అనేకమంది ఉన్నారు. ఇప్పుడు విపక్షాల తీరు అంతకు భిన్నంగా ఏమీ లేదు. తామేదో ఎథికల్ పోలీసింగ్ చేస్తున్నామని వారు భావిస్తున్నట్లుగా ఉంది. 

గోరంట్ల మాధవ్ (వీడియో నిజమైతే) ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా వ్యవహరించాడనేది పక్కన పెడితే.. ఇద్దరి వ్యక్తిగత వ్యవహారాన్ని రచ్చకీడ్చిన వారిని ఏమనాలి? సొంత భార్యతోనో, లేదా తనను ఇష్టపడే, చట్టం అనుమతించే రీతిలో సెక్స్ సంబంధాన్ని కలిగిఉన్న ఏ ఇతర ప్రియురాలితోనో ఒక నాయకుడు మాట్లాడే ప్రెవేటు సంభాషణల్ని వీళ్లు రాద్ధాంతం ఎలా చేయగలరు? చూడబోతే ముందుముందు.. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు గనుక.. వారు తమ తమ సొంత భార్యలతో ఎలా శృంగారంలో పాల్గొనాలో కూడా.. తామే నిర్దేశిస్తాం.. అని ఎథికల్ పోలీసింగ్ తరహా ఓవరాక్షన్ చేస్తున్న విపక్షాలు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. 

చీక‌టి బాగోతాల్లో ఇదొక ముచ్చ‌ట‌

తెలుగురాష్ట్రాల్లో ఒక ఉద్ధండ పిండం అయిన నాయకమ్మన్యుడు ఒకరున్నారు. సుదీర్ఘ అనుభవంతో అనేక గొప్ప గొప్ప రాజకీయ పదవులు కూడా నిర్వహించారు. సెక్స్ వ్యవహారాల విషయంలో ఆయనకు తనదైన సొంతముద్రగల రికార్డు ఉంది. ఆప్త స్నేహితులుగా చెలామణీ అయ్యే వారి కుటుంబసభ్యులతోనే, చాటుమాటు సెక్స్ సంబంధాలను కలిగిఉంటూ.. సదరు స్నేహితుల కష్టానికి, స్థాయికి మించి.. అనేకానేక పదవులను కట్టబెట్టిన చరిత్ర ఆయనది! అలాంటి నాయకుడి, తమ్ముడు గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు. 

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తొలిమడక దారిలోనే మలిమడక కూడా నడుస్తుంది కదా! ఈ సామెతలను గుర్తుకు తెచ్చేలా.. ‘అన్న ఏక్ నంబర్ కా’ అయితే ‘తమ్ముడు దస్ నంబర్ కా’ అన్నట్టుగా చెలరేగిపోయేవాడు. ఇవేవీ చాటుమాటు వ్యవహారాలు కాదు. ఆయన ఎక్కడ విడిది చేస్తే అక్కడే ఒక వ్యభిచార గృహం ఉన్నట్టుగా తయారయ్యేది. ఆ పిచ్చికి పరాకాష్ట తమ్ముడు!

అలాంటి తమ్ముడిని, సీనియర్ అయిన అన్నగారు పిలిచి మందలించి ఏం చెప్పారో తెలుసా? ‘నేను ఆడిన ఆటలకంటె నువ్వు ఎక్కువ ఆడబోయేదేం లేదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత.. ఇవన్నీ తగ్గించాలి.. అంటూ హితబోధ చేశాడు. 

అంతే తప్ప.. తప్పొప్పుల ప్రస్తావన లేదిక్కడ. మెజారిటీ అవకాశం రాని సజ్జనమూర్తులే! ఈ రంగాన్ని ఎలా ఉద్ధరిస్తారు? దొరికిన వాడికి తాటాకులు కడతారు.. దొరకని రంకు నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది.

స్థూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. 

సెక్స్ అనేది ఇద్దరి ప్రెవేటు వ్యవహారం.. వారి ప్రైవసీని ఎవరైనా గౌరవించాలి. ఏ మహిళకైనా సరే.. సెక్స్ పరమైన ఇబ్బందులు, ఏ రూపంలోనైనా లైంగిక వేధింపులు ఎదురైతే మాత్రం చీల్చి చెండాడేయాలి. ఈ సున్నితమైన విచక్షణగల విభజన రేఖను అందరూ అర్థం చేసుకోవాలి. 

.. వెంకట్ అరికట్ల