దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలంగాణ మంత్రులు పరుష పదజాలంతో దూషించడంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉండగా, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు ఆయన తల్లి, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మపై తిట్ల వర్షం కురిపించిన విషయం ఇక్కడ అప్రస్తుతం.
కృష్ణా జలాల విషయమై ఏపీ, తెలంగాణ మధ్య జగడం నడుస్తోంది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు తమ ప్రాంత నీళ్లను రాయలసీమకు దోచుకెళ్లిన నరరూప రాక్షసుడు అని తిట్టిపోశారు. నీళ్ల దోపిడీలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అని విమర్శించారు.
తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తామని, తమ వాదన ఎక్కడ వినిపించాలో అక్కడే వినిపిస్తామని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ప్రేమ కురిపించడం విశేషం.
వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ద్రోహం చేశారని… రాక్షసుడు అని వైఎస్సార్‌పై తెలంగాణ మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నారని వైసీపీ నేతలను జేసీ ప్రశ్నించారు. బండ బూతులు తిట్టే ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని నిలదీశారు. అలాగే తన నియోజక వర్గంలో ఒకరిద్దరు పోలీస్ అధికారుల భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. అలాంటి పోలీస్ అధికారులు మాట్లాడే తీరు మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.