రాయలసీమలోని బలమైన టీడీపీ నేతకు వైసీపీ గాలం వేసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆ టీడీపీ నాయకుడు గెలుపు గుర్రమని వైసీపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ హవాలో ఆయన ఓడిపోయినప్పటికీ, ప్రజాదరణ మాత్రం కోల్పోలేదని వైసీపీ సర్వేలో తేలింది. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సర్వే నివేదికలతో వైసీపీ అప్రమత్తమైంది.
రానున్న ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వివిధ సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తిరగకుండా, సొంత వ్యాపకాల్లో మునిగితేలుతున్న నేతలపై జగన్ ఆరా తీస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఆ టీడీపీ నాయకుడి పేరులో మాత్రం పురాతన కాలం నాటి ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు నడుచుకుంటున్నారు. అలాగని ఆయనేమీ టీడీపీపై అసంతృప్తిగా లేరు.
టీడీపీ కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తోంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నూలు జిల్లాలో గెలిచే ఏకైక టీడీపీ నాయకుడిగా ఆయనకు గుర్తింపు వుంది. అందుకే ఆయన్ను తెచ్చుకోవాలని వైసీపీ పావులు కదిపింది. సదరు నాయకుడు పార్టీ మారేందుకు మొగ్గు చూపకపోయినా, ఆయన కుమారుడు మాత్రం వైసీపీలో చేరితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం.
దీంతో కుమారుడి వైపు నుంచి తండ్రిపై ఒత్తిడి తెచ్చేందుకు పలువురు ముఖ్య నేతల్ని రంగంలోకి దింపినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు తామే భరిస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. నెత్తిమీద ఆర్థిక భారం తొలగిస్తామనడం కొండంత సాయంగా సదరు నాయకుడి తనయుడు అంటున్నట్టు సమాచారం.
త్వరలో ఆ నాయకుడి విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ నాయకుడు వస్తే ఆ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగు ఉండదని అధికార పార్టీ నమ్మకంగా ఉంది.