కొన్ని వారాల క్రితం.. తెలుగుదేశం యువకిశోరం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంతర్జాతీయ నేత నారా లోకేష్ బాబు జూమ్ మీటింగ్ ఒకటి పెట్టారు.
అది పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్థులతో! గ్రేస్ మార్కులు వేసి తమను పాస్ చేస్తే చాలు అని పరితపిస్తున్న విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారు! తెలుగు రాజకీయాలను ఆ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత అయనది!
లోకేష్ తో జూమ్ మీటింగులో ఒక ఆట ఆడుకోవాలని ఆయన ప్రియమైన శత్రువులు కొందరు భావించారు. అందులో భాగంగా .. వారు జూమ్ మీటింగులోకి వచ్చారు! చొరబడ్డారు అని టీడీపీ అంటోంది. మరి వారితో జూమ్ మీటింగులో చర్చించడానికి లోకేష్ ఎందుకు వెనుకడుగు వేశారో! తనతో చర్చకు రావాలంటూ పలు సార్లు లోకేష్ స్వయంగా సవాళ్లు విసురుతుంటారు కూడా!
అప్పుడు జూమ్ లోకి వచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకుడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. ఆ జూమ్ మీటింగులోకి ఎంటరయ్యారు. వారు రాగానే.. వారి లైన్ లను కట్ చేసేసి మీటింగ్ ముగించేశారు. వారిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. మరి చర్చించిఉంటే సరిపోయేది. ఉన్నట్టుండి వారి ఎంట్రీతో లోకేష్ షాకై నట్టుగా ఉన్నాడు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ తర్వాత మళ్లీ లోకేష్ జూమ్ మీటింగులు పెట్టడం లేదు! రాజకీయం అంతా సోషల్ మీడియాతో చేయాలనేది లోకేష్ తపన. అందుకే ఇప్పటి వరకూ ఆయన ట్విటర్ కు, ఫేస్ బుక్ కు, యూట్యూబ్ కూ, జూమ్ మీటింగులకు పరిమితం అయ్యారు! అక్కడ వీరావేశాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో మళ్లీ జూమ్ లో కనపడలేదు లోకేష్.
ఒక్కసారి జూమ్ మీటింగులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎంట్రీ తర్వాత.. లోకేష్ మళ్లీ ఇప్పటి వరకూ జూమ్ మీటింగ్ ఆలోచన చేస్తున్నట్టుగా లేరు. మరీ అంతలా అవాక్కయ్యారా!