సోమవారం మధ్యాహ్నం, ఇనార్బిట్ మాల్. థియేటర్ దాదాపుగా ఫుల్. శని, ఆదివారాల్లో జనం రాని స్థితిలో వున్నప్పుడు, ఒకవైపు వానలో తడుస్తూ జనం వచ్చారంటే మంచి సినిమా కాబట్టి. సినిమాలు బాగా తీస్తే జనం వద్దన్నా వస్తారు. ఇది రియాల్టీ. దీని కోసం మీటింగ్‌లు, బంద్‌లు అక్కర్లేదు.
సినిమా అంటే వ్యసనం నాకు. ఒకే రోజు మూడునాలుగు సినిమాలు చూసిన రికార్డు వుంది. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సినిమాల కోసం బెంగళూరు వెళ్లి ఒక మిషన్లా సినిమాలు చూసేవాన్ని (అప్పట్లో అనంతపురానికి చాలా లేట్‌గా హిందీ, ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి).
ఈ మధ్య కూడా తెల్లారి ఆరుకి లేచి, ఒక్కోసారి టిఫెన్ కూడా చేయకుండా ప్రసాద్ ఐమ్యాక్స్ చేరుకుని 8.45 గంటలకి సినిమా చూసి, రివ్యూ రాసేవాన్ని. అంత వీరాభిమాని నేను, ఈ మధ్య థియేటర్స్‌కి వెళ్లడం మానేశాను. కారణం రొటీన్ తుక్కు సినిమాలు చూసే ఓపిక లేక. ఆ సినిమాల గురించి రాసినందుకు కాదు, చూసినందుకే డబ్బులివ్వాలి. ఒకట్రెండు సార్లు రిజర్వ్ చేసి కూడా, వెళ్లడం మానుకున్నాను. తర్వాత రివ్యూస్ చదివి, డబ్బులు పోయినందుకు బాధ పడకుండా , సినిమా చూసే బాధ తప్పినందుకు సంతోషించాను. జనం భయపడుతున్నది టికెట్ రేట్లకి, థియేటర్లో పాప్‌కార్న్ ధరలకి కాదు, అంతకు మించి మన వాళ్లు తీస్తున్న తుక్కు సినిమాలకి.
హనూ రాఘవపూడి మంచి భావుకుడు, కవి. తెరమీద కవిత్వాన్ని రాస్తాడు. రంగులతో దృశ్యాన్ని పండిస్తాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి ప్రేమకథ తర్వాత మనకో మణిరత్నం దొరికాడని సంతోషించా. అయితే హనూతో సమస్య ఏమంటే టేకింగ్ మీద శ్రద్ధ, కథ, స్క్రీన్ ప్లేపై వుండదు. “లై”తో జడిపించాడు. పడిపడిలేచే మనసులో కొన్ని సీన్స్ ఓకే కానీ, సినిమా బోర్. ఆయన అన్ని సినిమాలు ఫస్ట్ మార్నింగ్ షో చూసిన నేను, సీతారామం జోలికి వెళ్లలేదు (ట్రైలర్ బాగున్నా). కారణం తను దారి తప్పాడని అనుమానం.
పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. రేటింగ్ మాత్రం చూశాను. రివ్యూ పూర్తిగా చదవలేదు. కథ తెలుసుకోవడం ఇష్టం లేక. తీరిగ్గా మెల్లిగా చూద్దామని అనుకున్నా. ప్రసేన్లాంటి నిర్మొహమాటి కూడా బావుందని రాస్తే, వెంటనే థియేటర్‌కి వెళ్లాను.
సినిమా స్టార్ట్ అయ్యింది మాత్రమే తెలుసు. మూడు గంటలు క్షణాల్లో గడిచిపోయాయి. బయటే కాదు, కళ్లలో కూడా అప్పుడప్పుడు వాన. ఇంటర్వెల్లో కూడా బయటికి వెళ్లాలనిపించలేదు. మంచి సినిమా లక్షణం ఇది.
గతంలో షోలేకి ప్లాప్ టాక్ వచ్చింది. ఇది పోతే జిపి సిప్పి రోడ్డు మీద వుంటాడు. ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తీశాడు. ఆయన బెంగళూరులోని డిస్ట్రిబ్యూటర్‌కి ఫోన్ చేసి టాక్ అడిగాడు.
“అర్థం కావడం లేదు సార్, ఇంటర్వెల్లో కూడా జనం లేవడం లేదు. షాకింగ్‌గా అలా కూర్చుండి పోతున్నారు” అని చెప్పాడట.
సిప్పికి వూపిరాడింది. మన సినిమా పెద్ద హిట్ అన్నాడు. అదే నిజం.
సీతారామం ఎంత హిట్ అని తూనికలు కొలతలు చెప్పలేం. ఆ తూకం రాళ్లు నా దగ్గర లేవు. కానీ చాలా కాలం మాట్లాడుకునే సినిమా, మాట్లాడే సినిమా. హనూ ఈజ్ బ్యాక్.
ఏముంది ఈ సినిమాలో ? రోజా, వీర్‌జరా, రోమన్హాలిడే ఇలా చాలా చూసేశాం కదా? ఎన్ని చూసినా ఇది వేరు. కవిత్వం, సంగీతం, పెయింటింగ్, నృత్యం, ఇలా కళలన్నీ కలిసిపోయి ఒక దృశ్యంగా మారితే అదీ ఈ సినిమా. పాత్రల చిత్రణలో ఒక శిల్పి పనితనం, శ్రద్ధ కనిపిస్తాయి. గొప్ప శిల్పమంటే ఒక రాయిలోని వృథాని తొలగించడమే.
దుల్కర్, మృణాల్ ఆ పాత్రల కోసమే పుట్టినట్టున్నారు. రష్మికలో అంత గొప్ప నటి వుందని ఆమెకి కూడా తెలియదేమో. సినిమాలో ప్రతిచిన్న పాత్ర కూడా గుర్తుండిపోతుంది.
టెంప్లెట్ కూడా పాతదే. మహానటిలో చూశాం. అంతకు ముందు ఆర్సన్ వెల్లస్ “సిటిజన్ కేన్” (1941)లో చెప్పిందే. (సిటిజన్ కేన్ స్క్రిప్ట్ రైటర్ పైనా డేవిడ్ ఫించర్ “మాంక్” అనే సినిమా తీసాడు. నెట్‌ప్లిక్స్‌లో వుంది) అయితే ఒక ప్రేమ కథని ఇలా చెప్పడం కొత్త. ఇంత బాగా చెప్పడం కొత్త.
మణిరత్నం అంత బాగా తీసే కుర్రాడు మనకీ వున్నాడు. కానీ అద్భుతాలు పదేపదే జరగవు. జరిగితే దాన్ని అద్భుతమనరు. హనూ రాఘవపూడి కూడా మళ్లీ సీతారామం లాంటి సినిమా తీయలేక పోవచ్చు. తీస్తే మన అదృష్టం.
సినిమాకెళితే బోలెడు డబ్బులు ఖర్చు అయిపోతాయి. డబ్బులు ఊరికే రావు. నిజమే. కానీ సీతారామం లాంటి సినిమాలు కూడా పదేపదే రావు. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా.
వానలో తడిసి, చలిచలిగా వున్నపుడు వేడివేడి కాఫీ తాగినంత బావుంటుంది.
జీఆర్ మహర్షి