టాలీవుడ్ గిల్డ్ తలపెట్టి, ఛాంబర్ సపోర్టు చేస్తున్న నిర్మాతల సమ్మె లేదా బంద్ మీద నందమూరి బాలకృష్ణ చాలా ఆగ్రహంతో వున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జరిగిన సంగతులను గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తోంది.
గిల్డ్ మీటింగ్ సంగతులు కానీ, సమావేశాల వివరాలు కానీ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు చేరేలా వార్తలు అందిస్తూ వస్తోంది. అయితే గతంలోనే ఈ సమ్మె లేదా బంద్ పై తన అసంతృప్తి వ్యక్తం చేసిన బాలకృష్ణ దానిని మరోసారి మళ్లీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
త్వరగా సినిమా స్టార్ట్ చేస్తారా? లేదా వేరే పని చూసుకోనా? ఈ సినిమా పక్కన పెట్టి వేరే సినిమా ఎక్కించమంటారా? అని నిర్మాతలను బాలయ్య గట్టిగా నిలదీసినట్లు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ‘ఏమైనా రాజుల కాలం అనుకుంటున్నారా? ఏమిటీ పోకడలు..అసలు ఏమనుకుంటారు వాళ్లు’ అంటూ బాలయ్య గట్టిగానే మాట్లాడారని నిర్మాతల సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. గిల్డ్ పెద్ద అని ముద్ర వేసుకున్న ఓ నిర్మాత గురించి కూడా బాలయ్య గట్టిగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదు, కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ, ఒక్కరి మాట పట్టుకుని బ్లైండ్ గా ముందుకు వెళ్లిపోతారా? అని అన్నట్లు బోగట్టా.
దీంతో నిర్మాతలు మైత్రీ మూవీస్ అధినేతలు కిందా మీదా అవుతున్నారు. ఇటు చూస్తే నిర్మాతల గిల్డ్ ఇప్పట్లో నిర్మాణాల బంద్ ను ఎత్తి వేసేలా కనిపించడం లేదు. అటు చూస్తే హీరో బాలయ్య గరం గరంగా వున్నారు. బంద్ చూస్తే 15 వరకు ఆగేట్టు లేదు.
దిల్ రాజు ఫ్రస్టేషన్
ఇదిలా వుంటే నిన్నటికి నిన్న జరిగిన డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో గిల్డ్ నాయకుడు దిల్ రాజు చాలా ఫ్రస్టేషన్ తో వున్నట్లు తెలుస్తోంది. ‘ఎందుకో దిల్ రాజు చాలా ఫ్రస్టేషన్ తో కనిపించారు. మీరెందుకు అలా వున్నారు అని అడిగితే, బాలయ్య చూస్తే షూటింగ్ అంటున్నారు. నాని కూడా అదే విధంగా వున్నారు. మహేష్ బాబు సినిమా ముహర్తం ఆగస్టు 15 దగ్గరకు వస్తోంది. ఇప్పుడు ఏదో ఒకటి సాధించకుండా బంద్ ఆపితే నా పరిస్థితి ఎలా వుంటుంది’ అని దిల్ రాజు అన్నారని సమావేశంలో పాల్గొన్న ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పారు.
అసలు బంద్ మొదలుపెట్టి వారం దాటింది. ఇప్పుటికి రోజు మూడు మీటింగ్ లు తప్ప సాధించిందేమిటి? అని ఓ నిర్మాత ప్రశ్నించారు. మీటింగ్ లు తప్ప ఇదేదీ అయ్యేదీ కాదు పొయ్యేది కాదు అని సమావేశంలో పాల్గొన్న ఓ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్యానించారు.