తెలంగాణ అధికార పార్టీపై బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మనసు పారేసుకున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు బలం కలిగిస్తున్నాయి. పైపెచ్చు పార్టీ ఆదేశా లను ధిక్కరించి తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో 2023 అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న వేళ మోత్కుపల్లి వ్యవహారం ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉంది. ఒక వైపు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ప్రజా బలం కలిగిన అసంతృప్త నేతలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తన పార్టీలోకి చేర్చుకుంది.
మరికొందరు నేతలను చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్న వేళ …మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారం పార్టీకి మింగుడు పడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళితుల అభ్యున్నతి విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. అయితే పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. అంతేకాదు, సీఎం కేసీఆర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని పొగడ్తలతో ముంచెత్తారు.
మరీ ముఖ్యంగా కేసీఆర్ నిర్వహించిన మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం ఆ పార్టీకి పుండుమీద కారం చల్లినట్టైంది. ఒకవేళ తాను మీటింగ్‌కు వెళ్లకుంటే బీజేపీపై యాంటీ దళిత ముద్ర పడేదని వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లడం వల్లే బీజేపీ బతికిందని కామెంట్ చేయడం బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీపై మోత్కుపల్లి అసంతృప్తిగా ఉన్నారని, ఒక బలమైన కారణం చూసుకుని బయటికి రావాలనుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉంటూ, పార్టీపై నెగెటివ్ ముద్ర వేసి వెళ్లాలని భావిస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. త్వరలోనే మోత్కుపల్లి ముసుగు తొలుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.