గ్రూప్-1 రిక్రూట్మెంట్లో ఇకపై ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ బోర్డులోని కొందరు వ్యక్తులు లోపాయికారి ఒప్పందం చేసుకుని ఇంటర్వ్యూ మార్కులు ఎక్కువ వేస్తూ… మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి.
కానీ సంస్కరణలు చేపట్టాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ బోర్డుపై ఆరోపణలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జగన్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంది.
ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది.
ఏపీపీఎస్సీ ఉద్యోగాల ఎంపికలో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఈ ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది.
ఉద్యోగాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా పలువురు విద్యావేత్తలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా కేవలం పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకోవడం ప్రశంసలు అందుకుంటోంది. ఒక రకంగా ఇది ఉద్యోగ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు శుభవార్త అని చెప్పొచ్చు.