సౌత్ సినిమాల సక్సెస్ లను కొందరు బాలీవుడ్ స్టార్లు ఓర్వలేకపోతున్నారు. మరి కొందరేమో సౌత్ సినిమాలను చూసి పాఠాలు నేర్వాలని హితబోధ చేస్తున్నారు. సబ్జెక్టులను టేకప్ చేయడంలో సౌత్ సినిమాలు ముందున్నాయంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకులు చెప్పుస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకూ వచ్చిందంటే… సౌత్ కు నచ్చని సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ కు తెగ నచ్చేస్తున్నాయి!
సౌత్ సినిమాల పట్ల ఇక్కడి ప్రేక్షకుల్లో పూర్తి స్థాయి సంతృప్తి అయితే లేదు. అడపాదడపా మాత్రమే అందరినీ ఆకట్టుకునే సినిమాలు వస్తున్నాయిక్కడ కూడా! అయితే.. బాలీవుడ్ కు మాత్రం సౌత్ ఇప్పుడు అపురూపంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ బ్లీడింగ్ పేరిట హిందీ సినీ విమర్శకులు అక్కడి సినిమా వాళ్ల తీరును ఎండగడుతున్నారు. ఈ వ్యవహారంలో వారు ప్రస్తావిస్తున్న మరో కీలకమైన అంశం.. హిందీ స్టార్ హీరోల రెమ్యూనిరేషన్లు!
బాలీవుడ్ సినిమాలకు హీరోల రెమ్యూనిరేషన్లు భారం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. సౌత్ స్టార్ల కన్నా.. బాలీవుడ్ లో ఓ మోస్తరు హీరోల రెమ్యూనిరేషన్లు ఎప్పుడూ భారీ స్థాయిలో ఉంటూ వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో రోజులు మారాయి.
సొంత భాషతో పాటు పక్క భాషలో మార్కెట్ ను సంపాదించుకుంటున్న తెలుగు, తమిళ స్టార్ హీరోలు భారీ రెమ్యూనిరేషన్ల విషయంలో బాలీవుడ్ హీరోలను దాటేశారు. హిందీపై కూడా వీరికి పట్టు చిక్కుతుండటంతో ఈ స్థాయి మరింత భారీ స్థాయికి వెళ్తోంది.
ఇలాంటి పరిణామాల మధ్యన.. హిందీ హీరోల రెమ్యూనిరేషన్ల విషయంలో అక్కడి విశ్లేషకులు గగ్గోలు పెడుతున్నారు. అక్షయ్ కుమార్ 130 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు. ఇటీవలి అతడి సినిమా పృథ్విరాజ్ ఆ రెమ్యూనిరేషన్ స్థాయికి తగ్గ వసూళ్లు సాధించలేదు.
ఇక రణ్ భీర్ కపూర్ రేంజ్ 75 కోట్ల రూపాయలు. అయితే అతడి ఇటీవలి సినిమా కూడా ఆ మేరకు వసూళ్లను రాబట్టలేదు! ఇక రణ్ వీర్ సింగ్ 50 కోట్ల రూపాయల డిమాండ్ స్థాయిలో ఉన్నాడు!
ఇలా బాలీవుడ్ స్టార్లు భారీ స్థాయిలో రెమ్యూనిరేషన్లు తీసుకోవడం హిందీ సినిమాలకు అదనపు భారంగా మారిందని, వారి రెమ్యూనిరేషన్ల మొత్తాలకు తగిన వసూళ్లు కూడా రావడం బాలీవుడ్ కు పెనుశాపంగా మారందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.