టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణాలుగా నందమూరి కుటుంబసభ్యులు చెప్పినట్లు నిన్నంతా టీవీ చానెళ్లలో మారుమోగింది. కొన్ని ఆత్మహత్యలకు బలమైన కారణాలుంటే, కొన్నింటికి అంతగా కారణాలు ఉండవు.
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తుంటాయి. భర్త వేధిస్తున్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు, వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు, సెల్ ఫోన్ కొనివ్వలేదని, పరీక్షలో తప్పామని ….ఇలా ఎన్నో రకాల కారణాలతో ఆత్మహత్యలు జరుగుతుంటాయి.
కొన్ని ఆత్మహత్యలు ప్లాన్ ప్రకారం (ముందే నిర్ణయించుకొని) జరిగితే, కొన్ని క్షణికావేశంలో జరుగుతాయి. ఏదిఏమైనా ఆత్మహత్య అనేది పిరికి చర్య.
నందమూరి కుటుంబంలో ఆత్మహత్య జరిగిందంటే అది కచ్చితంగా సంచలనమే. ఎందుకంటే ఆ కుటుంబం సినిమా రంగంలో, రాజకీయరంగంలో లెజండరీ ఫ్యామిలీ. కాబట్టి ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణాలు కాకపోవొచ్చు.
ఇంకా యేవో బలమైన కారణాలు ఉండే ఉంటాయి. కుటుంబసభ్యులు సహజంగానే ఆ కారణాలను బయటకు చెప్పరు. ఎందుకంటే నందమూరి కుటుంబసభ్యులకు తీవ్రమైన ఆర్ధిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు ఎప్పుడూ వార్తలు రాలేదు. ఆరోగ్యపరంగా చిన్నాచితక సమస్యలుంటే ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంత ఆరోగ్య సమస్యలు ఏముంటాయి?
ఒకవేళ ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారు ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఉమా మహేశ్వరి పరిస్థితి అటువంటిది కాదు. ఆమె ఆర్ధికంగా స్థిరపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ వైద్యుడు. అంతకుముందు ఆయన అమెరికాలో కొన్నేళ్లు ఉన్నాడు.
హైదరాబాదుకు వచ్చాక యేవో వ్యాపారాలు చేస్తున్నాడు. పెద్దకూతురు అమెరికాలో సెటిల్ అయింది. ఈమధ్యనే వివాహం జరిగిన రెండో కూతురు హైదరాబాదులోని బాచుపల్లిలో ఉంటోంది.
నందమూరి కుటుంబంలో అన్నాదమ్ముల, అక్కాచెల్లెళ్ల మద్య ఒకరిమీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయంటారు. అందరూ ఆర్ధికంగా బాగా ఉన్నవారే. ఒకవేళ ఉమా మహేశ్వరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వైద్యం చేయించుకునే స్తొమత ఉంది. అవసరమైతే విదేశాల్లో కూడా చికిత్స చేయించగలరు. భర్త స్వయంగా వైద్యుడు. మరి ఇంకేమిటి? ఆమె ఆత్మహత్యకు చెబుతున్న మరో కారణం మానసిక ఒత్తిడి. ఆమె మానసికంగా కుంగిపోయేంత సమస్యలు ఏమున్నాయో తెలియదు.
ఒకవేళ ఉన్నా ఈరోజుల్లో దానికీ వైద్యం ఉంది. మానసిక ఒత్తిడిని అధిగమించడం కష్టమేమీ కాదు. అందులోనూ ఉమా మహేశ్వరి చదువుకున్న వ్యక్తి. ఉండేది హైదరాబాదులో. కాబట్టి ఎలాంటి వైద్యమైనా అందుబాటులో ఉంటుంది. వైద్య నిపుణులు ఉంటారు.
కాబట్టి ఇవి సరైన కారణాలుగా కనబడటం లేదు. కుటుంబంలో ఏదో జరిగి ఆమె క్షణికావేశంలో ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అసలు కారణం ఏమిటనేది తెలియాలి. ఆమె మొదటి వివాహం తమిళనాడుకు చెందిన నరేంద్ర రాజన్ అనే అతనితో జరిగింది. కానీ కొంతకాలానికే అది విఫలమైంది.
అప్పుడు ఎన్టీఆర్ చాలా ఆవేదన చెందారు. అందులోనూ ఉమా మహేశ్వరి చివరి కూతురు కావడంతో ఆయనకు చాలా ఇష్టం. తండ్రి రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేది. తరువాత ఆమెకు కంఠంనేని శ్రీనివాస ప్రసాద్ తో వివాహం జరిగింది. బంజారా హిల్స్ ఇల్లు తండ్రి ఆమెకే ఇచ్చారు.