దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్ఘనిస్తాన్ లో అపసోపాలు పడ్డ అమెరికా.. ఎట్టకేలకూ కొంతకాలం కిందట ఆ దేశాన్ని ఖాళీ చేసింది. ఎన్ని మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టినా.. అఫ్ఘన్ తో ఉగ్రమూకల ఏరివేత కష్టమని, ఖర్చుకు కూడా జడిసి అమెరికా తన దారి తను చూసుకుంది. ఇన్నేళ్లుగా అమెరికా అండదండలున్న ప్రభుత్వ పాలనతో స్వేచ్ఛగా జీవించిన అఫ్ఘనిస్తాన్ ప్రజలు.. మళ్లీ తాలిబర్ల చెరలోకి వెళ్లిపోయారు.
అమెరికా సైన్యం ఖాళీ చేసి వెళ్లిపోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దేశం పూర్తిగా మళ్లీ తాలిబన్ల పరమైంది. తాలిబన్ల పాలనతో బతకలేమనుకున్న వాళ్లు ఆ దేశాన్ని ఖాళీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు దేశం దాటగలిగారు కానీ, మరెంతో మంది అక్కడే మగ్గుతున్నారు.
ఇక మిగతా ప్రపంచానికి కూడా అఫ్ఘన్ ప్రజల కష్టాలు కొన్నాళ్లు పట్టాయి కానీ, ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు పడిపోయారు. ఇప్పుడు అఫ్ఘన్ గురించి పట్టించుకునేంత తీరిక మిగతా ప్రపంచానికి లేదు. అంతర్జాతీయ రాజకీయంలో రష్యా- ఉక్రెయిన్ వార్ గురించి చర్చ కూడా దాదాపు ముగిసింది. ఏదైనా కొన్నాళ్లే చర్చలో ఉంటుంది మరి!
ఇలాంటి తరుణంలో అమెరికా ఎట్టకేలకూ ఒక చిన్న విజయం సాధించింది. అల్ ఖైదా అధినేత జవహరీని సీఐఏ మట్టుబెట్టింది. ఒసామా బిన్ లాడెన్ ను అమెరికన్ సైన్యం తుదముట్టించిన దగ్గర నుంచి జవహరీ అల్ ఖైదా అధినేతగా ఉన్నాడు. అఫ్ఘన్ లో అమెరికా సైన్యం తిష్ట వేసినప్పుడు.. ఏ పాకిస్తాన్ లోనో ఉగ్రతండాల్లో తలదాచుకుంటూ బతికినట్టుగా ఉన్నాడు జవహరీ. ఇప్పుడు అమెరికా సైన్యం ఖాళీ చేయడంతో రిలాక్సయ్యాడో ఏమో.. సీఐఏ చేపట్టిన అపరేషన్ కు చిక్కాడు.
జవహరీ అంతుచూసినట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్ బైడన్ ప్రకటించుకున్నారు. న్యాయం జరగడం లేట్ అయినప్పటికీ.. అంతిమంగా న్యాయం జరిగిందంటూ బైడన్ ప్రకటించుకున్నారు. ట్విన్ టవర్స్ పై 2001లో జరిగిన దాడుల వెనుక జవహరీ ని సూత్రధారిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా అప్పట్లోనే ప్రకటించింది. జవహరీ ఒక ఈజిప్షియన్.