పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్య తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆ తరహా హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రత్యేకించి సెలబ్రిటీలను గ్యాంగ్ స్టర్లు టార్గెట్ చేసుకోవచ్చనే పుకార్లు, కొన్ని బాహాటమైన హెచ్చరికలు వినిపించాయి.
సెలబ్రిటీలపై అటాక్ ద్వారా విపరీతమైన పేరు ప్రఖ్యాతులను ఆర్జించవచ్చు అని కూడా కొందరు గ్యాంగ్ స్టర్లు లెక్కలేస్తూ ఉండవచ్చు. మరి కొందరు ప్రచారం కూడా ఫలానా హీరో తమకు టార్గెట్ అంటూ ప్రకటించారు కూడా. ఇలాంటి క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడం తనకు లక్ష్యమంటూ లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్టర్ ప్రకటించుకున్నాడు.
నల్లజింకలను వేటాడిన కేసులో నిందితుడు అయిన సల్మాన్ ను చంపి పగ తీర్చుకుంటానంటూ ఆ జింకలను ఆరాధించే బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ బిష్టోయ్ ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై కేసులు కూడా ఏవో నమోదైనట్టుగా ఉన్నాయి.
ఆ సంగతలా ఉంటే.. ఇలాంటి హెచ్చరికల ఫలితంగానో లేక జాగ్రత్తగా ఉండటం మంచిదని అనుకున్నాడో కానీ.. సల్మాన్ ఖాన్ అలర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు గానూ సల్మాన్ ఖాన్ తను ప్రయాణించే కార్లను అప్ గ్రేడ్ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాటి అద్దాలను బుల్లెట్ ప్రూఫ్ గా మార్చుకున్నాడట ఈ బాలీవుడ్ బిగ్ స్టార్.
ప్రయాణ సమయాల్లో తనపై అటాక్ జరగకుండా నిరోధించేందుకు సల్మాన్ ఖాన్ ఈ మార్గాన్ని నమ్ముకుంటున్నట్టుగా ఉన్నాడు. అతడి ఆర్థిక స్థితిగతులను బట్టి చూస్తే.. బుల్లెట్ ప్రూఫ్ కార్లను పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ అప్ గ్రేడ్ అవుతున్నట్టుగా ఉన్నాడు. అలాగే వ్యక్తిగత గన్ లైసెన్స్ విషయంలో కూడా సల్మాన్ ఖాన్ అప్లై చేసుకున్నాడట.
తనకు ఆత్మరక్షణ నిమిత్తం గన్ కావాలంటూ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నాడట. ఈ విషయంలో పోలీసు అధికారులను కూడా సల్మాన్ ఖాన్ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అగంతకుల వ్యవహారంలో సల్మాన్ అలర్ట్ అవుతున్నట్టుగా ఉన్నాడు.