ఫోన్ లో మ‌హిళ‌ల డైలాగ్ వార్‌…వైర‌ల్‌

సెల్‌ఫోన్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల డైలాగ్ వార్‌. ఒక‌రేమో ప్ర‌జాప్ర‌తినిధి, మ‌రొక‌ట‌రేమో అధికారి. స‌ద‌రు మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి అధికార పార్టీ ఎమ్మెల్సీ సోద‌రి కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆ ఆడియో…

సెల్‌ఫోన్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల డైలాగ్ వార్‌. ఒక‌రేమో ప్ర‌జాప్ర‌తినిధి, మ‌రొక‌ట‌రేమో అధికారి. స‌ద‌రు మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి అధికార పార్టీ ఎమ్మెల్సీ సోద‌రి కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆ ఆడియో క‌థాక‌మామీషూ ఏంటో తెలుసుకుందాం.

వ‌రంగ‌ల్ జిల్లా వేలేరు మండ‌లం షోడ‌ష‌ప‌ల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్ర‌మ త‌వ్వకాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌య‌మై ఆదాయ పంప‌కాల్లో స్థానిక ప్ర‌జాప్రతినిధుల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. 

దీంతో రెవెన్యూ అధికారుల‌కు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు చేసుకోవ‌డం స్టార్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో మొరం త‌ర‌లిస్తున్న వాహ‌నాల‌ను వేలేరు త‌హ‌శీ ల్దార్ విజ‌య‌ల‌క్ష్మి నేతృత్వంలో అధికారులు అడ్డుకున్నారు. వాహ‌నాల‌ను సీజ్ చేసి భారీ జ‌రిమానా విధించ‌డానికి త‌హ‌శీల్దార్ సిద్ధ‌మ‌య్యారు.

స‌రిగ్గా ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. భారీ జ‌రిమానాల విష‌యం తెలుసుకున్న వేలేరు జెడ్పీటీసీ స‌భ్యురాలు స‌రిత ఈ వివాదంలోకి ఎంట‌ర్ అయ్యారు. ఈమె ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి స్వ‌యాన సోద‌రి కావ‌డం గ‌మ‌నార్హం. త‌హ‌శీల్దార్‌కు స‌రిత ఫోన్ చేశారు. వాహ‌నాల‌కు భారీ జ‌రిమానా విధించొద్ద‌ని కోరారు. కేవ‌లం రూ.25 వేలు మాత్రమే జ‌రిమానా విధించాల‌ని త‌హ‌శీల్దార్ విజ‌య‌ల‌క్ష్మిని ఆమె కోరారు.

అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్‌ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడారు. అయితే త‌హశీల్దార్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. మీరు చెప్పిన‌ట్టు కూడా విన‌కూడ‌దు క‌దా అని జెడ్పీటీసీ స‌భ్యురాలిని ఎదురు ప్ర‌శ్నించారు. 

అంతేకాదు, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. దీంతో కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఎమ్మెల్సీ సోద‌రైన ఆమెకు ఇగో దెబ్బ‌తింది.

దీన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారామె. చివ‌రికి జెడ్పీటీసీ మెంబ‌ర్ మాట విన‌ని త‌హ‌శీల్దార్‌కు బ‌దిలీ బ‌హుమానంగా వ‌చ్చింది.  తహశీల్దార్‌ విజయలక్ష్మిని కలెక్టరేట్‌కు బ‌దిలీ చేశారు. కానీ జెడ్పీటీసీ, త‌హ‌శీల్దార్ మ‌ధ్య జ‌రిగిన హాట్‌హాట్ ఫోన్ సంభాష‌ణ ఆడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది. 

అధికారి పార్టీ మ‌హిళా నేత బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ని త‌హ‌శీల్దార్ ధైర్యాన్ని జ‌నం మెచ్చుకుంటున్నారు. అధికారి అంటే ఇలాగుండాల‌నే ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.