ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ థియేటర్లలోకి రావడానికి ఇబ్బంది పడుతున్న వేళ.. ఒక అడుగు ముందుకేశాడు సాయిధరమ్ తేజ్. తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లలోకొచ్చిన పెద్ద సినిమా ఇదే. ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత ఆ బాధ్యతను నాగచైతన్య తీసుకోబోతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్/కర్ఫ్యూ నిబంధనలు ఎత్తేసిన తర్వాత లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో జులై రెండో వారానికి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను అమలు చేస్తూ సినిమా హాళ్లు తెరిచే అవకాశం ఉంది.
ఆ వెంటనే లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్. కుదిరితే జులై చివరి వారం లేదంటే ఆగస్ట్ మొదటివారంలో లవ్ స్టోరీ సినిమా థియేటర్లలోకి వస్తుంది.
దాదాపు ఏడాదిన్నరగా సాగుతూ వస్తోంది లవ్ స్టోరీ సినిమా. చివరికి ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తే, లాక్ డౌన్ పడింది. ఇక ఎక్కువ రోజులు ఈ సినిమాను ల్యాబ్ లో ఉంచడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ విడుదల చేయాలనే అనుకుంటున్నారు. అలా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి రాబోయే పెద్ద సినిమాగా నిలుస్తోంది లవ్ స్టోరీ.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీపై మంచి అంచనాలున్నాయి. ఓ పాటైతే ఆల్రెడీ పెద్ద హిట్టయింది.