ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఢిల్లీ దన్ను పుష్కలంగా ఉంది. దీనికి నిలువెత్తు నిదర్శనం విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, మద్దతు లభించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
హైకోర్టులో మూడు రాజధానుల అంశం విచారణలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపు ఉండదని అందరూ అనుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వ ఆలోచన మరోలా ఉంది. మొదట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసి, అక్కడి నుంచే సీఎం జగన్ పాలన చేపట్టాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూచనప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాను కలిసిన సమయంలో జగన్‌కు ఆయన నుంచి భరోసా లభించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధైర్యమే విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్‌ను ముందుకు నడిపిస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా మూడు రాజధానులకు మద్దతు, పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు రాబట్టడమే ఎజెండాగా జగన్ ఢిల్లీ పర్యటన సాగింది. ఢిల్లీ పర్యటన సానుకూల ఫలితాలను ఇస్తోందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపు పనులు చాపకింద నీరులా సాగిపోతున్నాయి. ముఖ్యంగా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని శరవేగంగా విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతోనే త్వరలో విశాఖ నుంచి పరిపాలన చేయాలనే నిర్ణయానికి జగన్ సర్కార్ వచ్చినట్టు చెబుతున్నారు. ఈలోపు కోర్టు కేసులూ పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ విచారణలో ఉండగా కార్యాలయాలు తరలిస్తే, సంబంధిత అధికారుల నుంచి ఆ సొమ్మును వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే పాలనకు ఇబ్బంది లేకుండా మాత్రమే ఏర్పాట్లకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో విశాఖ పాలన ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలను జగన్ సర్కార్ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా వైజాగ్‌లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బోయపాలెం వద్ద ఒక విద్యా సంస్థలో సచివాలయం ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విమానాశ్రయం నుంచి అక్కడి వరకూ.. ఎన్ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కి.మీ మార్గాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల విశాఖకు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెళ్లి విమానాశ్రయం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల మధ్య మార్గాన్ని పరిశీలించారని సమాచారం. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని మార్పులు చేయాలని సూచించారని తెలిసింది. అలాగే బీచ్ రోడ్డులో సీఎం నివాస స్థలాన్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.