బెయిల్‌పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల జగన్ సర్కార్‌కు వరుస ప్రేమలేఖలు రాస్తున్నారు. ఈ పరంపరలో నేడు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై నెటిజన్లు తమదైన సృజనాత్మక సెటైర్లతో రఘురామకృష్ణంరాజును చెడుగుడు ఆడుతున్నారు. అతి మంచిది కాదనేందుకు రఘురామకృష్ణంరాజు తాజా ఉదంతమే నిదర్శనం.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకులకు డీఏ, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది సీఎంకు రాసిన ఆరో లేఖ. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలిచారని.. వారికి న్యాయం చేయాలని రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. హామీలపై లేఖలు రాయడం మంచిదే. ఇందుకు రఘురామకృష్ణంరాజును అభినందించాల్సిందే.
అయితే తాజా లేఖ రఘురామకృష్ణంరాజుకు సంబంధించి నెటిజన్లకు ఏవేవో గుర్తుకు తెచ్చాయి. ఇది నెటిజన్ల తప్పు కాదు. జ్ఞాపకాలను మనసు తెరపైకి తెచ్చేలా ప్రేరణ కలిగించిన రఘురామకృష్ణంరాజు లేఖ గొప్పతనంగా చెబుతున్నారు. నెటిజన్లు రఘురామకృష్ణంరాజుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
తమరు బ్యాంకులకు ఎగురవేసిన రుణ బకాయిలను చెల్లిస్తే…జగన్ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తుందని హితవు చెబుతున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు బ్యాంకులకు ఎగురవేసిన రుణాలు, సీబీఐ కేసు అంశాలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుండడం విశేషం.
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు , ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న ఇంద్‌భరత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ కంపెనీ బ్యాంకులను తీవ్రంగా మోసగించడం, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అలాగే తమ నిధులను దాదాపు రూ.237.84 కోట్ల మేర స్వాహా చేశారని ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖ సీబీఐకి చేసిన ఫిర్యాదును సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణంరాజుకు గుర్తు చేస్తున్నారు.
రఘురామకృష్ణంరాజు కంపెనీ ఎస్‌బీఐకి రూ.107.57 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు రూ.123.65 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.46.05 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.13.95 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.6.62 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గణాంకాలతో సహా సోషల్ మీడియాలో లెక్కవేసి మరీ చెబుతున్నారు. ఇవే కాకుండా యూకో బ్యాంకు, ఐఎల్ ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు ఎంతెంత రుణాన్ని బకాయి పడ్డావో మీరు చెబుతారా? మేమే చెప్పాలా రఘురామా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తమరు బ్యాంకులకు ముందు రుణ బకాయిలు చెల్లించిన తర్వాత జగన్ సర్కార్‌కు ప్రేమ లేఖలు రాస్తే బాగుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు. బ్యాంకులుండేది తమలాంటి బడా నేతలు ముంచడానికి కాదు రాజుగారు అని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అబ్బే…తీసుకున్నవి తిరిగి ఇవ్వడం రాజుగారి ఇంటావంటా లేవని కామెంట్స్ పెడుతున్నారు. రాజుగారు వింటున్నారా?