7 నెంబర్ ఈటలకు కలిసొస్తుందా ?

టీఆర్ఎస్ మాజీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అత్యంత దురదృష్టకర పరిస్థితుల్లో కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన స్వభావానికి, భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన పార్టీలో చేరాడు. బీజేపీలో ఈటల పూర్తి ఇష్టంతో…

టీఆర్ఎస్ మాజీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అత్యంత దురదృష్టకర పరిస్థితుల్లో కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన స్వభావానికి, భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన పార్టీలో చేరాడు. బీజేపీలో ఈటల పూర్తి ఇష్టంతో చేరి ఉండకపోవచ్చు. ఆయన టీఆర్ఎస్ నాయకుడు కాకపోయినా ఆయన వామపక్ష భావజాలానికి బీజేపీ అంటే ఇష్టం ఉండదు.

టీఆర్ఎస్ నాయకుడిగా, మంత్రిగా బీజేపీ మీద అనేకసార్లు ఘాటు విమర్శలు చేశాడు. కానీ ఇప్పుడు ఈటలకు బీజేపీలో చేరడం ముఖ్యం కాదు. కేసీఆర్ మీద పగ తీర్చుకోవడం ప్రధానం. అందుకు బీజేపీ సరైన వేదిక అనుకున్నాడు. దానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అందువల్ల ఆ పార్టీలో చేరితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. 

ఇక బీజేపీ తన మూల సిద్హంతాలను ఏనాడో వదిలేసింది. దాన వీర శూరా కర్ణ సినిమాలో దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ మా కురు వంశం ఏనాడో కులహీనమైనది అన్నట్లుగా బీజేపీ ఏనాడో కలుషితమైపోయింది. ఈటలకైనా, బీజేపీకైనా రాజకీయ ప్రయోజనాలే ప్రధానం కాబట్టి కలిసి పోయారు. కాబట్టి ఈటల బీజేపీలో చేరడం పెద్ద చర్చనీయాంశం కాదు.

ఇక ఈటల తమ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాడనేది రాష్ట్ర నాయకులేకాదు, కేంద్ర నాయకులు కూడా అనుక్షణం గమనిస్తుంటారు. ఈటల సీనియర్ నాయకుడే కాకుండా ఉద్యమ నాయకుడు కూడా. రాష్ట్రస్థాయి నాయకుడు కూడా. కాబట్టి కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో ఈటల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

ఈటల కాషాయం కండువా కప్పుకున్నప్పుడే మరి కొందరు కూడా కప్పుకున్నారు. అప్పుడే బీజేపీలోకి ఇంకా చేరికలు ఉంటాయని ఈటల అన్నాడు. దీంతో ఈటల ఇంకా కొందరిని బీజేపీలోకి తీసుకువస్తాడని లేదా ఆయన ప్రభావంతో ఇంకా కొందరు పార్టీలోకి వస్తారని బీజేపీ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఈ ఆశలను ఈటల ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి. 

ఇదిలా ఉండగా.. ఈటల ఏడో సారి ఎన్నికల (ఉప ఎన్నిక) బరిలోకి దిగబోతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయ్యాక 2004 నాటి శాసనసభ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి తొలిసారి గెలిచాడు.  అప్పటివరకు కమలాపూర్ లో తిరుగులేని నేతగా ఉన్న ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి 20 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అంతేకాదు.. ఈటల చాలాకాలం టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగానూ కొనసాగాడు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగానూ వ్యవహరించాడు.

2008లో కేసీఆర్ పిలుపుతో తొలిసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. 2009లో కమలాపూర్ స్థానం రద్దు కావడంతో తన నియోజకవర్గం హుజూరాబాద్ అయింది. ఇక అప్పటి నుంచి హుజూరాబాద్ ఈటలకు అడ్డాగా మారిపోయింది. అక్కడ తిరుగులేని నాయకుడిగా  ఎదిగాడు. 

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఈటల కూడా రాజీనామా చేశాడు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా 2014, 2018లోనూ హుజూరాబాద్ నుంచి గెలిచాడు. త్వరలో ఉప ఎన్నిక ఎదుర్కోబోతున్నాడు. 

సాధారణంగా 7 , 13 అంకెలను ఎక్కువమంది ఇష్టపడరు. ఇప్పటికీ ధాన్యం కొలిచేటప్పుడు ఆరు వరకు కొలిచి 7 ను వదిలేస్తారు. దానికి బదులు ఆరునొక్కటి అంటారు. ఆ తరువాత 8 నుంచి లెక్కపెడతారు. ఇదో సెంటిమెంటు. ఈటల వామపక్ష భావజాలం ఉన్నవాడు కాబట్టి సెంటిమెంట్స్ ఉండకపోవచ్చు. కానీ ఏడోసారి పోటీ చేయబోతున్నాడు కాబట్టి గెలుపు సాధ్యమవుతుందా ?