కించపరిచే వ్యాఖ్యలు చేశాడంటూ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఫిర్యాదు చేసింది.
ఈ నెల 13న ఆదివారం ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాసను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ పేర్కొన్నారు. ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా పలువురి మనోభావాలు దెబ్బతీసేలా హైపర్ ఆది వ్యవహరించారనే ఫిర్యాదులు వెళ్లాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారంటూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ తదితరులు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ద్వంద్వార్థాలు, బూతు మాటలు, ముఖ్యంగా మహిళలు, గిట్టని రాజకీయ నేతలు, సినీ నటులపై కూడా హైపర్ ఆది స్కిట్‌లలో తనదైన స్టైల్‌లో విమర్శిస్తారని ఆరోపణ ఉంది. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా తన మార్క్ బూతును మాత్రం ఆ కార్యక్రమం విడిచిపెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ భాష, యాసతో పాటు ఆ రాష్ట్ర ప్రజలు ఆరాధనతో చేసుకునే గౌరమ్మ, బతుకమ్మ పండగలను కించపరిచేలా స్కిట్ ప్రదర్శించడంతో పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లింది.