ఎల్లో మీడియాపై గ‌వ‌ర్న‌ర్‌ చావు దెబ్బ

నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామ‌కంపై గ‌వ‌ర్న‌ర్ బ్రేక్ వేస్తాడ‌ని ఆశించిన‌, ఊహించిన వారికి గ‌ట్టి షాక్ త‌గిలింది. జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఏదో ఒక విధంగా బుర‌ద చ‌ల్లాల‌నే ఏకైక ల‌క్ష్యంతో నిత్యం వార్తా క‌థ‌నాలు వండి…

నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామ‌కంపై గ‌వ‌ర్న‌ర్ బ్రేక్ వేస్తాడ‌ని ఆశించిన‌, ఊహించిన వారికి గ‌ట్టి షాక్ త‌గిలింది. జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఏదో ఒక విధంగా బుర‌ద చ‌ల్లాల‌నే ఏకైక ల‌క్ష్యంతో నిత్యం వార్తా క‌థ‌నాలు వండి వార్చే ఎల్లో ప‌త్రిక‌కు గ‌వ‌ర్న‌ర్ భారీ షాక్ ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ త‌న నిర్ణ‌యంతో ఆ ప‌త్రిక విశ్వ‌స‌నీయ‌త‌ను చావు దెబ్బ తీశారు.

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆమోద ముద్ర వేసి… ఉద‌యం నుంచి ఓ ఎల్లో మీడియా చేస్తున్న విష ప్ర‌చారంలో నిజం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. 

గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర‌తో  తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యేందుకు మార్గం సుల‌భ‌మైంది. ఇక వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డ‌మే త‌రువాయి. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అనంత‌రం నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫైల్‌పై గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేశారు.  

ఇదిలా ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ ప‌రిశీల‌న‌లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫైల్ ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు అనుకూల ప‌త్రికలో ‘నామినే టెడ్‌’ ఎమ్మెల్సీలకు.. గవర్నర్‌ బ్రేక్‌!’ శీర్షిక‌తో ఓ క‌థ‌నం వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్‌కు ఉండే సిస‌లైన అధికార‌మేమిటో బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ చూపించ‌నున్నార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిన జాబితాను పెండింగ్‌లో అందుకే పెట్టార‌ని రాసుకొచ్చారు. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జాబితాలో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయని రాశారు.

ఇలా క‌థ‌నానికి మ‌రికొంత మ‌సాలా జోడించి వండివార్చారు. ఒక‌వేళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వం పంపిన నాలుగు పేర్ల‌కు ఓకే చెబితే, అప్పుడు మ‌రో ర‌కంగా క‌థ‌నం అల్ల‌డానికి ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా ఒక ముక్క రాసి ప‌డేశారు. అదేంటో చూద్దాం.

‘గ‌వ‌ర్న‌ర్‌ మనోగతం తెలియడంతో ముఖ్యమంత్రి ఆయ‌న్ను కలవాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 5గంటలకు సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. గవర్నర్‌కు ముఖ్య‌మంత్రి నచ్చజెప్పి ఆమోదం పొందగలుగుతారా లేక ఆ రెండుపేర్లు తప్పించి వేరే పేర్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ పరిణామం వైసీపీ వర్గాలను షాక్‌కు గురి చేసింది’

తాజాగా ప్ర‌భుత్వం పంపిన న‌లుగురి పేర్ల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో ఆ ఎల్లో మీడియాకు రాత్రంతా నిద్ర ప‌ట్టే అవ‌కాశాలు లేవు. తెల్లారితే ఆ ప‌త్రిక‌లో బ‌హుశా ఈ విధంగా క‌థ‌నం రావ‌చ్చు.

‘ప్ర‌భుత్వం పంపిన న‌లుగురి పేర్ల‌లో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డిల‌పై క్రిమినల్ కేసులుండ‌డంతో గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం చెప్పారు. దీంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ‌మేఘాల‌పై గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కెళ్లారు. ఆ ఇద్ద‌రి పేర్ల‌ను తొల‌గిస్తే త‌ప్ప సంత‌కం చేయ‌న‌ని గ‌వ‌ర్న‌ర్ భీష్మించారు. అయితే త‌న ప‌రువు పోతుంద‌ని, ఎలాగైనా పెద్ద మ‌న‌సు చేసుకుని ఆమోద ముద్ర వేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను ముఖ్య‌మంత్రి ప్రాథేయ‌ప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్‌కు న‌చ్చ చెప్ప‌డానికి జ‌గ‌న్‌కు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చినంత ప‌నైంది. చివ‌రికి  తాను పంపిన ఫైల్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొంద‌గ‌లిగారు’ అని రాస్తారేమో!

కింద‌ప‌డ్డా త‌మ‌దే పైచేయి అన్న‌ట్టు…తాము రాసిన‌ట్టే జ‌రిగింద‌ని రేప‌టి సంచిక‌లో రాసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే తిమ్మిని బ‌మ్మి; బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల విద్య‌లో ఆరితేరిన ఎల్లో బ్యాచ్ అది. క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాదకారి.