ఇలాగైతే కాదు…రంగంలోకి దిగాల్సిందే ర‌ఘురామ‌!

బెయిల్‌పై విడుద‌లైన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజులో మ‌రింత ప‌ట్టుద‌ల పెరిగింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని త‌న ప్ర‌భుత్వానికి ఆయ‌న ప్రేమ లేఖ‌లు రాస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు నేడు రాసిన లేఖ‌తో ఆ…

బెయిల్‌పై విడుద‌లైన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజులో మ‌రింత ప‌ట్టుద‌ల పెరిగింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని త‌న ప్ర‌భుత్వానికి ఆయ‌న ప్రేమ లేఖ‌లు రాస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు నేడు రాసిన లేఖ‌తో ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. గ‌తంలో ఇదే రీతిలో లేఖ‌లు రాసి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. త‌ల‌నొప్పి, త‌త్వం ఏదైనా బోధ ప‌డేదాకా తెలియ‌దని పెద్ద‌లు చెబుతారు.

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలో కూడా అదే జ‌రిగిన‌ట్టుంది. ఇటీవ‌లి అనుభ‌వాలు ఆయ‌న ఊహించిన‌వి, కోరుకున్న‌వి ఎంత మాత్రం కావు. అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే క‌దా రాజ‌కీయ‌మైనా, జీవిత‌మైనా. అందుకే ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సంబంధించి చోటు చేసుకున్న ప‌రిణామాలు పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం విడుదల చేయాలని సీఎం జగన్‌ను రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్‌కు రఘురామ లేఖలు రాస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు‌, పెళ్లికానుక..షాదీముబారక్‌, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ అంశాలను గ‌త నాలుగు ప్రేమ లేఖ‌ల్లో ప్రస్తావించిన విష‌యం తెలిసిందే. తాజాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయాన్ని జ‌గ‌న్‌కు రఘురామ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. లేఖ‌లు రాయ‌డం బాగుంది. కానీ లేఖ‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ స్పందించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న పంథాను మార్చాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ర‌ఘురామ రావ‌య్యా …ఒక్క‌సారి మా కోసం ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి పోరాడయ్యా అనే ఆహ్వానాలు అందుతున్నాయి.

జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక విధానాలు, హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై బాధితుల‌ను పెద్ద ఎత్తున కూడ‌గ‌ట్టి ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వ్య‌క్తిగ‌త‌, కుటుంబ‌, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లొచ్చిన వారికి ర‌ఘురామే గుర్తుకొస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేశ్‌కు, స‌స్పెండ్ జ‌డ్జి రామ‌కృష్ణ‌కు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వెలుగులోకి రాని అనేక మందికి క‌ష్టాల్లో ర‌ఘురామ‌కృష్ణంరాజు గుర్తుకు రావ‌డం, ఆయ‌న గారు చొర‌వ తీసుకుని ఫిర్యాదులో, సిఫార్సు లేఖ‌లో రాస్తూ బిజీగా ఉన్నారు.

ఆప‌ద్బాంధ‌వుడిలా క‌నిపిస్తున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు ఢిల్లీ వ‌దిలి గ‌ల్లీకొచ్చి త‌న ప్ర‌భుత్వ విధానాల‌కు పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ర‌ఘురామ రంగంలోకి దిగితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌దనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌న్నింటిని ఏకం చేసే శ‌క్తియుక్తులు కేవ‌లం ర‌ఘురామ‌కృష్ణంరాజుకు మాత్ర‌మే ఉన్నాయి. ఆయ‌న ముంద‌డుగు వేస్తే జ‌నం అంతా పోలోమ‌ని త‌ప్ప‌క క‌దులుతుంది.  

మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌న్న‌ట్టే, ఉత్త లేఖ‌ల‌కు ప్ర‌భుత్వాలు ప‌లికే ప‌రిస్థితి లేదు. ర‌ఘురామ‌కృష్ణంరాజు పోరాడితే పోయేదేం లేదు…ప్ర‌జాస‌మ‌స్య‌లు త‌ప్ప‌. క‌మాన్ ర‌ఘురామ లేఖ‌లొదిలి, పోరాట‌బాట ప‌ట్టు.