మెగా హీరో రామ్ చరణ్ కు జీవితంలో మరిచిపోలేని డిజాస్టర్ ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి మాత్రం దర్శకుడు బోయపాటి మాంచి సేవలే అందిస్తున్నారు. తెలుగుదేశం కోసం ఆయన దాదాపు డజను ఎన్నికల ప్రచార ప్రకటనలు తయారుచేసి అందించారు. వాటిలో తన మార్క్ ఎమోషన్, క్వాలిటీ, రీరికార్డింగ్ అందించి సత్తా చాటుకున్నారు. టీవీ ల్లో ఏ ఛానెల్, ఏ టైమ్ లో ఆన్ చేసినా, ఈ ప్రకటనలు వచ్చేలా అడ్వర్ టైజ్ మెంట్ ప్యాకేజ్ లు తెలుగుదేశం పార్టీ కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ ప్రకటనలు అన్నీ జనాలకు కంఠతా వచ్చేసాయి.
ఇదిలావుంటే అసలు సిసలైన ఓ బాంబ్ లాంటి ప్రకటనను బోయపాటి రెడీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ ప్రకటన బాబు నేరుగా ప్రధాని మోడీపైనే. ఆయన ఈ రాష్ట్రానికి గుప్పెడు మట్టి, ముంతడు నీళ్లు తప్ప ఇచ్చిందేమీలేదు అనే అర్థంవచ్చేలా తయారుచేసిన ప్రకటన. రాష్ట్రానికి ఏం ఇవ్వాలి? ఏం ఇచ్చారు? ఇవన్నీ కలపి చాలా బలమైన ప్రకటనను బోయపాటి తయారుచేసినట్లు తెలుస్తోంది.
దీన్ని ఎన్నికల పోలింగ్ కు నాలుగు అయిదురోజుల ముందు వదుల్తారని తెలుస్తోంది. అప్పటి వరకు ఈ సంక్షేమ ప్రకటనలు గుప్పించి, తరువాత దగ్గరచేసి, ఆంధ్రుల ఆత్మగౌరవం, మోడీ మోసం వగైరాల బ్యాక్ డ్రాప్ లో తయారుచేసిన ఈ ప్రకటన వదుల్తారని తెలుస్తోంది.
ఏది ఏమైనా బాలయ్య సినిమా ఎన్నికల తరువాతకు వాయిదా పడినా, ఖాళీ టైమ్ ను, బోయపాటి పార్టీకోసం బాగానే వాడినట్లున్నారు.