హమ్మయ్య.. ఈ కోణం కూడా కవర్ చేశావా పవన్!

చంద్రబాబు మౌత్ పీస్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం పవన్ కల్యాణ్. చంద్రబాబు ఒకటి అందుకుంటారు, దాన్ని పవన్ కల్యాణ్ కొనసాగిస్తారు. వైసీపీపై ఎలాంటి ఆరోపణలు చేయాలి, ఏ నేతపై ఎలాంటి విమర్శలు చేయాలో…

చంద్రబాబు మౌత్ పీస్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం పవన్ కల్యాణ్. చంద్రబాబు ఒకటి అందుకుంటారు, దాన్ని పవన్ కల్యాణ్ కొనసాగిస్తారు. వైసీపీపై ఎలాంటి ఆరోపణలు చేయాలి, ఏ నేతపై ఎలాంటి విమర్శలు చేయాలో చంద్రబాబు ముందుగా గైడెన్స్ ఇస్తే, పవన్ వాటిని తూచ తప్పకుండా అమలు చేస్తుంటారు. అలా బాబుకు దత్తపుత్రుడు అనిపించుకున్నారు పవన్.

అయితే ఇలా బాబు అడుగుజాడల్లో ఎంత బాగా నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పవన్ విషయంలో అంతోఇంతో వెలితి ఉండేది. అది కూడా ఇవాళ్టితో తీరిపోయింది. ఎప్పుడైతే పవన్ కల్యాణ్, ఏపీ పోలీసుల్ని విమర్శించారో, డిపార్ట్ మెంట్ పై ఆరోపణలు చేశారో.. దత్తపుత్రుడు అనే పదం పూర్తిగా స్థిరపడిపోయింది. అలా తన బిరుదుకు పూర్తి న్యాయం చేశారు పవన్ కల్యాణ్.

ఇన్నాళ్లూ పవన్ కు, చంద్రబాబుకు ఏమైనా చిన్న తేడా ఉందంటే అది ఇది మాత్రమే. చంద్రబాబులా పవన్ ఎప్పుడా పోలీసులు, అధికారులపై విరుచుకుపడలేదు. వారిని తిడుతూ బహిరంగంగా లేఖలు, ప్రెస్ నోట్లు విడుదల చేయలేదు. ఇప్పుడా ముచ్చట కూడా తీరిపోయింది. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో ఏపీ పోలీసుల వ్యవహారశైలి ఏమాత్రం బాగా లేదంటూ, చంద్రబాబు డప్పును తను వాయించడం మొదలుపెట్టారు పవన్ కల్యాణ్.

స్వయంగా సదరు ఎమ్మెల్సీ నేరం అంగీకరించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్ఛంగా, స్వతంత్రంగా డిపార్ట్ మెంట్ వ్యవహరిస్తోంది. కళ్ల ముందు ఇంత కనిపిస్తుంటే.. పవన్ కు మాత్రం అది కనిపించలేదు. పోలీసుల వ్యవహారశైలి ఆయనకు నచ్చలేదంట.

నేరం ఒప్పుకున్న అనంతబాబు పట్ల పోలీసులు గౌరవమర్యాదలతో వ్యవహరిస్తున్నారట. ఎక్కడలేని మర్యాద ఇస్తున్నారట. సామాన్యులకు కూడా ఇదే విధమైన సహృదయత కల్పిస్తారా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విధమైన తీరుకు వైసీపీనే కారణం అని ఆరోపిస్తున్నారు పవన్. ఈ విషయంలో పవన్ కల్యాణ్ అమాయకత్వం చూస్తే జాలేస్తుంది.

నేరం చేసిన వ్యక్తి స్థాయిని బట్టి ట్రీట్ మెంట్ ఉంటుంది. ఇదొక హై-ప్రొఫైల్ కేసు. నేరం చేసింది స్వయానా ఎమ్మెల్సీ. అలాంటప్పుడు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారు. అదనపు సెక్యూరిటీ, అదనపు వాహనాలు ఏర్పాటుచేయడం కామన్. దేశంలో ఎన్ని హై-ప్రొఫైల్ కేసుల్లో ఇలాంటివి చూడలేదు. 

అంతెందుకు, అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసినప్పుడు వాహన శ్రేణిని పవన్ కల్యాణ్ చూడలేదా? అచ్చెన్నాయుడ్ని పోలీసులు ఎలా ట్రీట్ చేశారో పవన్ కు తెలియదా. మొన్నటికిమొన్న నారాయణను అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో పవన్ కు తెలియదా? అనంతబాబు విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నారు. అంతమాత్రానికే పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారంటూ పవన్ ఆరోపించడం కామెడీగా ఉంది.

ఈ సంగతి పక్కనపెడితే, ఎప్పట్లానే పవన్ మరోసారి టాపిక్ ను పక్కదోవ పట్టించారు. అనంతబాబు విషయంపై మాట్లాడుతూనే.. కోడి కత్తి కేసు, వివేక హత్య కేసు అంటూ సందర్భం లేని అంశాల్ని టచ్ చేశారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోయాయంటూ మరో ఓపెన్ స్టేట్ మెంట్ పడేశారు. అలా బాబుకు అన్ని విధాలుగా దత్తపుత్రుడ్ని తానేనని అనిపించుకున్నారు.