ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా అటుఇటుగా 10 రోజులు కుదురుగా థియేటర్లలో నిలబడగలిగింది. మహానాయకుడు 3 రోజుల్లోపే తట్టాబుట్టా సర్దేస్తోంది. ఖాళీగా కనిపిస్తున్న థియేటర్లే దీనికి నిదర్శనం. మల్టీప్లెక్స్ ల్లో సైతం పట్టుమని పదిమంది కూడా థియేటర్ కు రావడంలేదు.
ఓవైపు చంద్రబాబు ఇది మన సినిమా, టీడీపీతో అనుసంధానమైన సినిమా, ప్రతి ఒక్కరూ చూడండి అంటూ తమ్ముళ్లకు ఉపదేశమిస్తుంటే.. అసలు ఆ థియేటర్లవైపే కన్నెత్తి చూడటంలేదు పార్టీ జనాలు. దీంతో సినిమా ఎలాగైనా ఆడేలా చేయాలని నేతలపై అధినేత ఒత్తిడి పెంచారు. అంతే.. బుధవారం నుంచి చందా షోలు మొదలయ్యాయి. కనీసం 50శాతం ఆక్యుపెన్సీ ఉండాలనేది తెలుగుదేశం నేతలకు విధించిన కండిషన్.
అలా మహానాయకుడిని టీడీపీ నేతలు చందాలు వేసుకుని మరీ ఆడిస్తున్నారు. పెయిడ్ షోలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. టీడీపీ నేతలు టికెట్లు కొని పంచిపెడుతున్నారు. బుధవారం జర్నలిస్ట్ లు, వారి ఫ్యామిలీ మెంబర్లకు టికెట్లు ఫ్రీగా అందించారు. ఇలా ఒక్కోరోజు ఒక్కోవర్గం వారికి టికెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నారు.
ఉచితంగా టికెట్లిచ్చినా కొంతమంది మొహమాటానికి వాటిని తీసుకుని సినిమాకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే జనాల్లో మహానాయకుడు సినిమా పట్ల ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ భయంతోనే ఎవరూ థియేటర్ల వైపు కన్నెత్తి చూడడంలేదు. ఉచితంగా టికెట్లిచ్చినా, ఇంటర్వెల్ లో స్నాక్స్ ఫ్రీ అని చెప్పినా కూడా నరమానవుడు, బాలయ్య నట విశ్వరూపాన్ని చూడడానికి సాహసం చేయడంలేదు.
చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ సినిమా కచ్చితంగా చూడాలని హుకుం జారీచేశారు. తెలుగు తమ్ముళ్లు సినిమా చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జిల్లాల వారీగా థియేటర్లలో నిఘా కూడా పెట్టారు. ఆయన దృష్టిలో అదో అద్భుత కళాఖండం. ఎంతైనా తన పాత్ర అందులో హీరో కదా, అందుకే ప్రతి ఒక్కరూ మహానాయకుడు చూడాలనేది బాబుగారి తపన.
ఆ తపన తీరుతుందో లేదో కానీ.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లతో డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా మునిగిపోయారనేది వాస్తవం. మరికొన్ని రోజుల్లో బాలయ్య నుంచి ఎలాంటి స్పందన రాకపోతే, వీళ్లంతా కలిసి ఆయన ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారు.