ఓ ప్రాజెక్టులో స్టార్ హీరో ఉన్నాడంటే ఇక అతడిదే రాజ్యం. అతడిమాటే శాసనం. అతడు చెప్పిందే వేదం. మేకింగ్ మాత్రమే కాదు, నిర్ణయాలు కూడా అతడి కనుసన్నల్లోనే జరగాలి. కుటుంబాలు, కాంపౌండ్ లకు అతీతంగా టాలీవుడ్ లో నడుస్తున్న సంస్కృతి ఇది. ఇలాంటి కల్చర్ లో బన్నీ మాట చెల్లలేదంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా.
అవును.. తన కొత్త సినిమాకు సంబంధించి అల్లుఅర్జున్ మాట చెల్లుబాటు కావడంలేదు. త్రివిక్రమ్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఇదంతా బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరక్టర్ వ్యవహారం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనేది బన్నీ ఆలోచన. కానీ దేవిశ్రీకి, దర్శకుడు త్రివిక్రమ్ కు కొన్నాళ్లుగా పొసగడంలేదు. దీంతో త్రివిక్రమ్ వ్యతిరేకించాడు.
లెక్కప్రకారం దర్శకుడు నో చెప్పినా హీరో చెప్పిందే జరగాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. బన్నీని త్రివిక్రమ్ డామినేట్ చేశాడు. దేవిశ్రీని కాదని, తమన్ ను తీసుకున్నాడు. ఈ మేరకు బన్నీని విజయవంతంగా ఒప్పించగలిగాడు కూడా. గతంలో తమన్ తనకు సరైనోడు, రేసుగుర్రం లాంటి హిట్స్ ఇవ్వడంతో బన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యాడు.
ఇక హీరోయిన్ విషయంలో కూడా బన్నీ మాట చెల్లలేదు. ప్రత్యేకంగా ఫలానా హీరోయిన్ కావాలని బన్నీ చెప్పలేదు కానీ పూజా హెగ్డేను రిపీట్ చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. కైరా అద్వానీ లాంటి కొత్తమ్మాయితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావించాడు.
కానీ త్రివిక్రమ్ మాత్రం దాదాపు పూజా హెగ్డేకే ఫిక్స్ అయ్యాడు. ఈ విషయంలో కూడా బన్నీ తనమాట నెగ్గించుకోలేకపోయాడట. మార్చి చివరివారం లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.