మునిగిపోయిన డిస్ట్రిబ్యూటర్లని పవన్‌ ఆదుకున్నాడా.?

''నాకు ఆత్మహత్య తప్ప ఇంకో దారి లేదు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో పూర్తిగా మునిగిపోయాను. నాకు న్యాయం చేయాలి..'' అంటూ, ఓ డిస్ట్రిబ్యూటర్‌ మీడియాకెక్కాడు కొంతకాలం క్రితం. 'కాటమరాయుడు' సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. 'అజ్ఞాతవాసి'…

''నాకు ఆత్మహత్య తప్ప ఇంకో దారి లేదు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో పూర్తిగా మునిగిపోయాను. నాకు న్యాయం చేయాలి..'' అంటూ, ఓ డిస్ట్రిబ్యూటర్‌ మీడియాకెక్కాడు కొంతకాలం క్రితం. 'కాటమరాయుడు' సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. 'అజ్ఞాతవాసి' సంగతి సరే సరి. వరుసగా మూడు సినిమాలతో పవన్‌కళ్యాణ్‌ కావొచ్చు, ఆయనగారి నిర్మాతలు కావొచ్చు.. డిస్ట్రిబ్యూటర్లను ముంచేసిన మాట వాస్తవం. మరి, పవన్‌ 'బాధితులకు' సాయం చేశాడా.? 

కర్నూలు జిల్లా పర్యటనలో వున్న పవన్‌కళ్యాణ్‌, 'నా సినిమాలకు నష్టం వస్తేనే, నా రెమ్యునరేషన్‌ తిరిగిచ్చేశాను. తిరిగిచ్చేయడం తప్ప, దాచుకోవడం నాకు తెలియదు. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే సినీ రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడం కోసమే. లక్షల కోట్ల బడ్జెట్‌ అంటే అది ప్రజల సొమ్ము. దానికి జవాబుదారీగా వుండాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన పార్టీకి అధికారమిస్తే, ప్రతి పైసాకీ లెక్కలుంటాయ్‌.. అవీ ఖచ్చితమైన లెక్కలు..' అంటూ వీరావేశంగా ప్రసంగించేశారు. 

అవునా.? అలాగైతే, పవన్‌కళ్యాణ్‌ తమకు న్యాయం చేయలేదంటూ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' డిస్ట్రిబ్యూటర్‌ ఎందుకు మీడియాకి ఎక్కినట్లు.? 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందు లీక్‌ అయి, నిర్మాతని తెగ టెన్షన్‌ పెట్టేసింది. ఆ తర్వాత ఆ సినిమా విజయవంతమైందనుకోండి.. అది వేరే విషయం. అయినాగానీ, ఆ సినిమాకి సంబంధించిన 'బ్యాలన్స్‌' విషయమై పవన్‌, నిర్మాతకి నోటీసులు పంపడం, ఆ తర్వాత ఆ నిర్మాత తన సన్నిహితుల వద్ద పవన్‌ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేయడం తెల్సిన విషయాలే. 

ఏదిఏమైనా, రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్‌కళ్యాణ్‌ తన సినిమాల సంగతి మర్చిపోతే మంచిది. సినిమా కబుర్లకి జనం పడిపోయే రోజులు కావివి. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఎలా బోల్తా పడ్డాడో తెలిసీ తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ కూడా అలాంటి మాటలే చెబితే ఎలా.? పైగా మూడు వరుస ఫ్లాప్‌ సినిమాల తర్వాత రాజకీయాల్లోకి పవన్‌ వచ్చాడాయె. అంతకు మించి, ఆ మూడు సినిమాల విషయంలోనూ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారాయె.