బిగ్ బాస్ టైమ్ లో సోషల్ మీడియాలో నానిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. దాదాపు వారంరోజుల పాటు నానిని ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాడు నాని. ఇదంతా తన కొత్త సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టడం వల్లనే.
నాని-విక్రమ్ కుమార్ కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ ను గ్రాండ్ గా ప్రకటించారు కూడా. ఎప్పుడైతే టైటిల్ ఇలా బయటకొచ్చిందో వెంటనే మెగా ఫ్యాన్స్ దీనిపై భగ్గుమన్నారు. చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ టైటిల్ ను వాడేంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ సోషల్ మీడియాలో మెగాభిమానుల డిమాండ్ ఏంటంటే.. గ్యాంగ్ లీడర్ టైటిల్ ను వాడే అర్హత కేవలం చిరు కొడుకు చెర్రీకి మాత్రమే ఉందట. ఇతర హీరోలెవరూ ఆ టైటిల్ ను టచ్ చేయడానికి వీల్లేదనేది వీళ్ల వాదన. ఈ విషయంలో వాళ్లు బన్నీని కూడా కేర్ చేయడంలేదు.
భవిష్యత్తులో బన్నీని కూడా ఈ టైటిల్ వాడనివ్వబోమంటున్నారు మెగా ఫ్యాన్స్. ఆమధ్య సాయిధరమ్ తేజ్ సినిమా కోసం ఇదే టైటిల్ పరిశీలించారని, తమ నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో సాయిధరమ్ తేజ్ ఆ టైటిల్ నుంచి వెనక్కి తగ్గిన విషయాన్ని ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. ఈ టైటిల్ చుట్టూ ఇంత హంగామా జరిగిన తర్వాత కూడా అదే టైటిల్ ను పెట్టడానికి నానికి ఎంతధైర్యం అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మెగా గ్రూప్ లోని మరోవర్గం మాత్రం, నాని ఈ విషయాన్ని మెగా కాంపౌండ్ కు ముందేచెప్పి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తోంది. చిరంజీవి లేదా రామ్ చరణ్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటారని కొందరు అంటున్నారు.
గతంలో గూఢచారి టైటిల్ పెట్టినప్పుడు కూడా అడివి శేషు, స్వయంగా వెళ్లి కృష్ణను కలిసి అనుమతి తీసుకున్నారు. టెక్నికల్ గా అవసరం లేనప్పటికీ అదొక మంచి పద్ధతి. ఇప్పుడిదే పద్ధతిని నాని కూడా ఫాలో అయి ఉంటాడని అంటున్నారు.
టైటిల్ వివాదంపై యూనిట్ అర్జెంట్ గా ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే. లేకపోతే ఈ వివాదం కాస్త చినికిచినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. టోటల్ గా ఈ టైటిల్ నే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.