ప్రజలపై, పల్లెలపై పెట్టుబడులు మేలే.

మా చిన్నప్పుడు గ్రామంలో ప్రభుత్వ ఆస్థి అంటే అక్కడ ఉండే ఓ ప్రాధమిక పాఠశాల. అది కూడా 1960 వరకూ ఓ పెద్ద పాక. పైన తాటాకుల కప్పు. కింద పేడతో అలికిన నేల.…

మా చిన్నప్పుడు గ్రామంలో ప్రభుత్వ ఆస్థి అంటే అక్కడ ఉండే ఓ ప్రాధమిక పాఠశాల. అది కూడా 1960 వరకూ ఓ పెద్ద పాక. పైన తాటాకుల కప్పు. కింద పేడతో అలికిన నేల.

1980 వచ్చేసరికి, చాలా చోట్ల పాక అలాగే ఉన్నా పైకప్పు మాత్రం పెంకులు. అప్పుడు ఎన్టీఆర్ వచ్చాక కింద అలికిన నేల మాయం అయి సిమెంట్ ఫ్లోరింగ్ వచ్చింది.

మొత్తానికి గ్రామంలో ఉండే ప్రభుత్వ ఆస్థి ఇదొక్కటే. కాస్త పెద్ద గ్రామాల్లో అయితే పశువుల ఆస్పత్రి ఉండేది. దానికి డాక్టర్ గారు కూర్చునే ఓ గది మాత్రమే ఉండేది. బయట మాత్రం పశువుల్ని కదలకుండా కట్టేసేందుకు ఇనప రాడ్లతో ఓ బందీఖాన ఉండేది.

అక్కడక్కడా గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం 1970-80 మధ్యకాలంలో వచ్చింది. అప్పటి వరకు దొరల లోగిళ్ళే పంచాయితీ కార్యాలయాలుగా చలామణి వెళుతుందేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రామ పంచాయతీ భవనాలు (పెంకుటిళ్ళు) గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన రెండో ఆస్థి. అప్పటికే పాల సంఘాలు వచ్చినా, అవి గ్రామాల్లో ఈ పంచాయితీ కార్యాలయం వసార (వరండా)లో పాల క్యాన్లు పెట్టుకుని పాలు సేకరించుకుని వెళ్ళిపోయేవారు.

చాలా పెద్ద గ్రామాల్లో పంచాయితీ కార్యాలయాలుగా ఉన్న పెంకుటిళ్ళలో ఓ గదిని గ్రంధాలయంగా మార్చారు. ఇవి చాలా పరిమితం. అక్కడ పుస్తకాలేమీ ఉండేవి కావు. ఏవో రెండుమూడు పత్రికలు ఉండేవి. ఓ పెద్ద చెక్క బల్ల, దానికి రెండువైపులా కూర్చోడానికి మరో రెండు చిన్న బల్లలు ఉండేవి.

ఇప్పటికీ పంచాయితీ కార్యాలయం, బడి మాత్రమే ప్రభత్వ ఆస్తి. పంచాయితీ పెంకుటింట్లోనే పాలకేంద్రం, పశువుల ఆస్పత్రి, గ్రంధాలయం ఉండేవి. ఇవే చాలా గ్రామాల పరిస్థితి. చాలా గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ఆస్థి లేదా infra.

ఇక ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అంటే 1980 దశకం ప్రథమార్థంలో తాలూకాలు పోయి మండలాలు వచ్చిన తర్వాత కొన్ని పెద్ద గ్రామాలు మండల కేంద్రాలు అయ్యాక, అక్కడ అప్పటివరకూ ఉన్న పంచాయితీ పెంకుటిల్లు, అందులోని పశువుల ఆస్పత్రి, గ్రంధాలయం వేరయ్యాయి. అంటే మరో రెండు పెంకుటిళ్ళు వచ్చాయి. వీటితో పాటు ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ వచ్చాయి.

అంటే 1990 దశకం నాటికి పెద్ద గ్రామాల్లో ప్రభుత్వ ఆస్థి బడి, పంచాయతీ కార్యాలయం, పశువుల ఆస్పత్రి, గ్రంధాలయం, ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్. కొన్ని చోట్ల అయితే పంచాయతీ కార్యాలయంలోనే పశువుల ఆస్పత్రి, గ్రంధాలయం చెరో గదిలో నడిచేవి. అయితే మిగతా గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ ఆస్థి అంటే బడి ఉన్న పెంకుటిల్లు, పంచాయితీ కార్యాలయం ఉన్న పెంకుటిల్లు. ఇవే ప్రభుత్వ ఆస్తులు.

అయితే 1980 దశకం నాటికి టీచర్స్ పనిచేసే ఊళ్ళకు దగ్గర్లోనే ఉండాలని రూలు వచ్చిందో, ఏమో, గ్రామాలకు 'ఉద్యోగస్తులు' ఒక్కొక్కరుగా వచ్చేశారు.

అలాగే ఈ దశకంలోనే బడి పెంకుటిళ్ళ స్థానంలో బిల్డింగులు వచ్చాయి. అలాగే కొన్ని గ్రామాల్లో టీడీపీ తరపున సర్పంచిగా ఎన్నికైన వారు గ్రామ పంచాయతీ కార్యాలయాల పెంకుటిళ్లను కూడా భవనాలుగా మార్చేశారు. మండల కేంద్రాల్లో ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీస్ ష్టేషన్లు పక్కా భవనాలుగా మారిపోయాయి.

కానీ చాలా గ్రామాల్లో బడి, పంచాయితీ కార్యాలయం మాత్రమే ప్రభుత్వ ఆస్థులు. అంతకు మించి ఏమీ ఉండేవి కావు. అంగన్వాడీ కేంద్రాలు వచ్చినా అవి బడి వరండాలోనే నడిచేవి.

ఇక 1990-2020 వరకూ, అంటే రెండు దశబ్దాల్లో గ్రామాల్లో దశలవారీగా సిమెంట్ రోడ్లు వచ్చాయి. మంచినీళ్ళకు బావులు పోయి కుళాయిలు వచ్చాయి. కానీ, బడి, పంచాయితీ కార్యాలయం అలాగే ఉండి పోయాయి. కాకపోతే గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ఆస్థి అంటే బడి, పంచాయితీ కార్యాలయంతో పాటు మంచినీళ్ళ ట్యాంకు కూడా చేరింది. మొత్తం మూడు.

ఇప్పుడు 2020 దశకం వచ్చేసింది. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చూస్తే బడి, పంచాయితీ కార్యాలయనికి అదనంగా రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం వచ్చేశాయి. ఇంకా విలేజ్ క్లినిక్, రైతులకోసం గోదాము, పశువుల ఆస్పత్రి, ఇంటింటికి సరుకుల పంపిణీ కోసం ఓ ప్రభుత్వ-ప్రైవేటు వాహనం, ఇంకా ఏవో ఒకటో రెండో భవనాలు వస్తాయి అంటున్నారు.

ఒక గ్రామంలో ప్రభుత్వ ఆస్తి ఇలా సమకూరడం infra పెరగడం, ఉద్యోగస్తుల సంఖ్య పెరగడం, ప్రభుత్వంతో ప్రజల లావాదేవీలు పెరగడం స్వాగతించాల్సిన మార్పు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'బేసిక్ ఇన్ఫ్రా' గ్రామాలకు చేరుకోవడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. 'బెటర్ లేట్ థెన్ నెవ్వర్' అంటే ఇదేనేమో!

ఏడు దశాబ్దాల తర్వాత సంపద, infra ఇలా గ్రామాలకు చేరుతోంది. గ్రామాలకు ఇంకా ఇవ్వండి. పెట్టుబడిదారులకు ఇవ్వడం, వాళ్ళు కంటితుడుపు పనులేవో చేసి భారీగా సంపద వెనకేసుకోవడం కంటే చిన్న సంపద అయినా పల్లెలకు ఇచ్చేయడం మేలు.

ఈ దేశానికి నాగార్జున సాగర్, శ్రీశైలం, పోలవరం వంటి ప్రాజెక్టులు అవసరం. ఏదో పరిశ్రమ పెడతాం అని వేల ఎకరాల భూమి ప్రభుత్వం నుండి తీసుకుని,  లక్షల రూపాయల రాయితీలు పొంది, బ్యాంకులకు పంగనామాలు పెట్టే ప్రణాళికల కంటే చిన్నస్థాయిలో అయినా సంపద, మౌలిక సదుపాయాలు గ్రామాలకు ఇవ్వడమే మేలు. అదే అభివృద్ధి అని నేను గట్టిగా నమ్ముతా.

ప్రజలపై పెట్టుబడి, పల్లెలపై పెట్టుబడి ఎప్పటికీ వృధా కావు.

Let investment go to people.

Let infrastructure go to villages.

గోపి దారా (02-06-2021)