పశ్చిమ బెంగాల్ లో తాము అధికారంలోకి రావడం ఖాయమనేంత స్థాయిలో హంగామా చేశారు బీజేపీ వాళ్లు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు తమకు వచ్చిన సంచలన ఫలితాలతో బీజేపీ ఉబ్బితబ్బిబ్బయ్యింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం సాధిస్తామంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
అక్కడ అధికారాన్ని సాధించాలంటే.. మోడీ, అమిత్ షాలు అక్కడ ఎంత ఎక్కువగా తిరిగితే అంతమంచిదని బీజేపీ లెక్కలేసింది. ఆ మేరకు తీవ్రమైన కసరత్తు కొనసాగింది. అయితే.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారం సాధించడం మాట అటుంచి, దేశం కరోనా బారిన పడుతున్న వేళ ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మీద దృష్టి నిలిపారంటూ మోడీ, అమిత్ షాలు తీవ్ర విమర్శలకు గురయ్యారు.
ప్రజలు పెను ముప్పు బారిన పడుతున్న విషయాన్ని గ్రహించలేకపోవడం పాలకుడి దూరదృష్టి లోపమే. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ను ప్రిడిక్ట్ చేయడంలో కానీ, వ్యాక్సినేషన్ విషయంలో కానీ మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలం అయ్యింది. ఈ క్రమంలోనే వచ్చిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా కమలం పార్టీకి తీవ్రమైన నిరాశ తప్పలేదు.
కనీసం సెకెండ్ వేవ్ కరోనా తీవ్ర స్థాయికి చేరకముందు బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి కాబట్టి బీజేపీ ఆ మాత్రం సీట్లను అయినా సంపాదించుకుంది, సెకెండ్ వేవ్ కరోనా తర్వాత ఇలాంటి వేడి మీద ఎన్నికలు జరిగి ఉంటే.. కమలం పార్టీ పరిస్థితిని అంచనా వేయడం కష్టం ఏమీ కాకపోవచ్చు. ఆ సంగతలా ఉంటే.. బెంగాల్ లో అధికారం బీజేపీదే అనే భ్రమలతో ఫీట్లు చేసిన వాళ్లంతా తమ విన్యాసాలను ఉపసంహరించుకుంటున్నారు.
ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన లోక్ సభ సభ్యులు.. ఆ పదవులకు నెగ్గినా, తమకు ఎంపీ పదవులే కావాలంటున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఎంపీలుగా మిగులుతామంటున్నారు. తాజాగా రామ్ జఠ్మలానీ తనయుడిని కూడా మోడీ ప్రభుత్వం తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయన బెంగాల్ లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. అక్కడ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తిరిగి రాజ్యసభకు వెళ్లిపోతున్నారు!
మరోవైపు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన టీఎంసీ లీడర్లు తిరుగుబాట పడుతున్నారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదనే కారణాన్ని చూపి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారు ఇప్పుడు దీదీ.. అంటూ మమత కాళ్ల మీద పడటానికి రెడీ అవుతున్నారు. కొందరు బహిరంగ ప్రకటనలు చేసి బతకలేమంటున్నారు. ఇలాంటి వలస పక్షులు తిరిగి తమ గూటికి చేరిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాపును చూసే బీజేపీ బెంగాల్ లో తమ బలం అనుకున్నట్టుగా ఉంది!