నిన్న ఏం చేసావు అన్నది కాదు. ఇప్పడు ఏంటీ అన్నది లెక్క. అలాగే కబుర్లు చెబుతూ ఎల్లకాలం నెట్టుకురాలేరు. సత్తా చూపించాల్సిందే కొంతయినా. సినిమా ఫ్లాపులు అయినా, ఆ దర్శకుడి వల్ల నిర్మాతలు హ్యాపీ అంటే సినిమాలు వెదుక్కుంటూ వస్తాయి. సినిమాలు భారీగా హడావుడి చేసినా, నిర్మాతలు గుల్లయిపోతున్నారు అంటే ఇంక వ్యవహారం షెడ్ కు వెళ్లిపోతుంది.
దర్శకుడు బోయపాటి పరిస్థితి ఇలాగే వుంది. ఆయనవల్ల నిర్మాతలు బాగుపడరు అన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా పాతుకుపోతోంది. దాంతో బోయపాటి కార్నర్ అయిపోతున్నారు. దాంతో ఆయనను గట్టెక్కించడానికి అనుకూల కథనాలు వండి వార్పించాల్సిన పనిని ఆయన అనుచరవర్గం నడుంబిగించాల్సి వస్తోంది.
దర్శకుడు బోయపాటి తన సినిమా వినయ విధేయరామ పరాజయంతో మెగాక్యాంప్ కు, మెగాభిమానులకు టార్గెట్ అయ్యారు. ఆయన ఓ విధంగా కథానాయకుడు సినిమా కోసం ఈ సినిమాని బలిపెట్టారు అనే అనుమానాలు మెగాభిమానుల్లో బలంగా వున్నాయి. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ తెచ్చుకున్న ఇమేజ్ మొత్తాన్ని సమాధి చేసారు అనే ఆగ్రహం మెగాభిమానుల్లో వుంది.
ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దానయ్యతో గొడవ జరగడం, హీరో రామ్ చరణ్ ప్రతిపాదించినట్లు పారితోషికంలో కొంత వెనక్కు ఇవ్వడానికి విముఖంగా వుండడం వంటి వాటితో మెగా క్యాంప్ కూడా ఇప్పుడు బోయపాటి మీద ఆగ్రహంగా వున్నట్లు బోగట్టా. ఇలాంటి టైమ్ లో ఇక మెగా హీరోలు బోయపాటికి ఇప్పట్లో డేట్ ఇవ్వకపోవచ్చు. మరీ భయంకరమైన హిట్ కొడితే తప్ప ఈ పరిస్థితి మారకపోవచ్చు.
మరోపక్క ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన కేఎల్ నారాయణ, మైత్రీ, గీతా తమ తమ అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వమని అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క బాలయ్య తన సినిమాకు బౌండ్ స్క్రిప్ట్, బడ్జెట్ కంట్రోల్ అడుగుతున్నారని వదంతులు వున్నాయి, బాలయ్య నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న ఆయన బంధువు ప్రసాద్ తో ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్లు తేజ, క్రిష్ లకు గొడవలు తప్పలేదు. మరి బోయపాటితో పరిస్థితి ఎలా వుంటుందో?
ఇలాంటి టైమ్ లో బోయపాటికి ఊరట కలిగే వార్తలు వండివార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాతల మూతుల నేతుల వాసన అన్నట్లు బోయాపాటి గతకాలపు హిట్ లను గుర్తు చేస్తున్నారు. నిజానికి హిట్ లు సంగతి పక్కన పెడితే, లెజెండ్, దమ్ము, జయజానకీ నాయక సినిమాలు అన్నీ ఆర్థికంగా నిర్మాతలకు నష్టాలు ఇచ్చినవే. ఇటీవలి కాలంలో సరైనోడు ఒక్కటే కాస్త ఊరట. వినయ విధేయ సంగతి తెలిసిందే.
బోయపాటి ఇప్పుడు చిన్న సినిమా తీయలేరు. ఆయనకు 70 కోట్లు కావాల్సిందే. 70 కోట్లు పెట్టే నిర్మాతలు లేరు. అలాంటి నిర్మాతలు కావాలంటే, ముందు ఆ రేంజ్ హీరోలు కావాలి. చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తప్ప ఆ రేంజ్ హీరోలు లేరు. వాళ్లు డేట్ లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల బాలయ్య ప్రాజెక్టు ఏమాత్రం అటు ఇటు జరిగినా బోయపాటి కొన్నాళ్లు ఖాళీగా వుండిపోవాలేమో?