గతంలో వైఎస్ఆర్ హయాంలో ఏడు విడతలుగా భూ పంపిణీ జరిగింది. పేదలంతా భూ పంపిణీ వల్ల లబ్ధి పొందారు. ఇప్పటికీ వారంతా వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో అది ఆగిపోయింది.
జగన్ వచ్చి మూడేళ్లవుతున్నా, భూ పంపిణీ గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు భూ పంపిణీపై మంత్రి కాకాణి చిన్న హింట్ ఇచ్చారు. త్వరలో భూ పంపిణీ జరుగుతుందని అన్నారు. అంటే ఇప్పటి వరకూ చేపట్టిన నవరత్నాలు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే భూ పంపిణీ మరొక ఎత్తు అన్నమాట. ఈ ఎత్తుతో టీడీపీ చిత్తవడం ఖాయం అని అంటున్నారు వైసీపీ నాయకులు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీలో భూ పంపిణీ గురించి మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ వైసీపీ నేతలు భూ పంపిణీ గురించి మాట్లాడలేదు, తొలిసారిగా మంత్రి దాని గురించి మాట్లాడారంటే.. ఆల్రెడీ పార్టీలో చర్చ జరిగే ఉంటుంది. త్వరలో రాష్ట్ర స్థాయి ప్లీనరీలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆరోజు ఆమోదించే 15 అంశాల్లో భూ పంపిణీ కూడా ఉండొచ్చు అంటున్నారు.
అదే నిజమైతే.. ఇప్పటివరకూ సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకున్న నేతలు, ఇకపై భూ పంపిణీ చేసిన ఘనత తమదేనని మరింత ఘనంగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ తర్వాత ఆ స్థాయిలో పేద రైతుల కష్టాలను తీర్చేందుకు సీఎం జగన్ పెద్ద బాధ్యత తలకెత్తుకున్నారని అనుకోవచ్చు.
అనాధీనంగా ఉన్న వ్యవసాయ భూముల్ని ఎవరో ఒకరు సాగు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అవి బీడు భూములుగా కూడా ఉంటాయి. అలాంటి వాటిని సాగు చేసుకునే రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఏడు విడతల్లో వేలాది ఎకరాలను రైతులకు అప్పగించారు. ఆయా భూములపై రైతులకు పూర్తి హక్కులొచ్చాయి. పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారు.
ఇప్పుడా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునఃప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. తండ్రిలా తను కూడా భూమిలేని నిరుపేద రైతులకు జగన్ అండగా నిలబడబోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు.. ఈ భూపంపిణీ కూడా జరిగితే.. అది జగన్ పై ప్రజాభిమానాన్ని శాశ్వతం చేస్తుంది.