1980లో శంకరాభరణం వచ్చింది. అప్పటి వరకూ ఎవరికీ తెలియని జెవి సోమయాజులు స్టార్ అయ్యారు. నాకు విశ్వనాథ్ సినిమాలంటే చాలా ఇష్టం. మొదటి రోజు ఫస్ట్ మార్నింగ్ షో చూసి తీరాలి. పెద్దయి, మార్క్సిజం పరిచయమైన తర్వాత ఆయన కథా వస్తువుతో విభేదాలున్నాయి కానీ, కథ చెప్పడంలో, టేకింగ్‌లో విశ్వనాథ్ మాస్టర్. ఆయన సినిమాల్లో మంచి వాళ్లే వుంటారు. దురాశపరులుంటారు కానీ దుర్మార్గులుండరు. ఒకటో రెండో మసాలా సినిమాలు తీయడానికి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. మంచి పాటలు, సంగీతం, సున్నితమైన హాస్యం ఇవన్నీ గ్యారెంటీ. సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ సంస్కారవంతంగా వుంటుంది.
సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మికి వీరాభిమానిగా మారిన తర్వాత శంకరాభరణం వచ్చింది. అనంతపురం శాంతి టాకీస్‌లో వేసారు. ఉదయం 11.30 ఆటకి వెళితే సైకిల్‌స్టాండ్ వాడు తిట్టుకుంటున్నాడు. “ఏంటికి ఏస్తారో ఇట్లా సినిమాలు” అని . కొత్త సినిమాకి కిటకిటలాడే స్టాండ్‌లో నాలుగైదు సైకిళ్లు కూడా లేవు అదీ బాధ. బయట చెనిక్కాయలు, బఠాణీలు అమ్మేవాళ్లు ఈగలు తోలుకుంటున్నారు. థియేటర్‌లో గట్టిగా పది మంది లేరు. జెవి సోమయాజులు అనే ముసలాయన్ని పోస్టర్‌లో చూసి ఎవరొస్తారు? మంజుభార్గవినే హైలైట్ చేసారు కానీ, అప్పటికి ఆమెకి కూడా పేరులేదు. విశ్వనాథ్ మీద ఎంత నమ్మకమున్నా, ఒక బోర్ సినిమాకి వచ్చాననే ఫీల్‌లోనే కూచున్నా.
పడవపై నదిలో ప్రయాణం. టైటిల్స్ స్టార్ట్. తెరపైన ఒక అద్భుతం. సోమయాజులు విశ్వరూపం. మహదేవన్ సంగీత జలపాతం. బాలు గంధర్వగానం. ఎన్నిసార్లు కళ్లు తుడుచుకున్నానో గుర్తు లేదు. మధ్యాహ్నం ఆటకి కూడా పది మంది లేరు. అడగని వాళ్లకి కూడా చెప్పాను సినిమా బావుందని.
సాయంత్రానికి వూరు అంటుకుంది. ఎల్‌పి రికార్డులు ఒక్కటి మిగల్లేదు. జనం క్యాసెట్ సెంటర్లకు శంకరాభరణం పాటల రికార్డింగ్‌కి పరుగులు తీసారు. రెండురోజుల తర్వాత అదే శాంతి థియేటర్‌లో నో టికెట్స్. జనం నిరాశగా వెళ్లిపోతున్నారు. సైకిల్ స్టాండ్ వాడు బిజీ. చెనిక్కాయల వాడికి చెయ్యి ఖాళీ లేదు.
జెవి సోమయాజుల్ని అంతకు మునుపు రారా కృష్ణయ్యలో చూసినా అంతగా రిజిస్టర్ కాలేదు. శంకరాభరణంలో నటన, కంఠం, వర్చస్సు చూస్తే ఆ పాత్ర కోసమే పుట్టాడా అన్నట్టుంది. తరువాత సప్తపది, వంశవృక్షంలో కాస్త మంచి పాత్రలు వేసాడు. మిగతా సినిమాలు పెద్దగా గుర్తు లేవు. శంకరశాస్త్రి కోసమే పుట్టాడు. మరణించాడు.
1928లో శ్రీకాకుళం జిల్లాలో పుట్టాడు. నటుడు జెవి రమణమూర్తి ఈయనకి సోదరుడు. అన్నదమ్ములిద్దరూ కన్యాశుల్కాన్ని 500 సార్లు ప్రదర్శించారు. రామప్పపంతులుగా వందలసార్లు నటించినా రాని గుర్తింపు ఒక్క శంకరశాస్త్రితో వచ్చేసింది. ఆ పాత్ర వేస్తున్నపుడు ఉద్యోగరీత్యా డిప్యూటీ కలెక్టర్‌గా ఆయన చాలా బిజీ. ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఫిర్యాదు అందితే, ఆయన సోమయాజులు ప్రతిభని గుర్తించి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ చేసారు. 84లో ఎన్టీఆర్ పదవీ విరమణ వయసు తగ్గించినపుడు రిటైరయ్యారు. తరువాత రంగస్థల కళలశాఖకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అధిపతిగా చేసారు.
2004 ఏప్రిల్‌లో గుండెపోటుతో హైదరాబాద్‌లో చనిపోయారు
జీఆర్ మహర్షి