కరోనా కట్టడికి ఎలాగైనా ఆయుర్వేదంలో మంచి మందును తయారు చేయించాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆయన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఎస్వీ ఆయుర్వేద వైద్య బృందంతో వెళ్లారు. గత కొన్ని రోజుల్లో కరోనా కట్టడికి ఆయుర్వేద మందు తయారీదారుగా పేరుగాంచిన ఆనందయ్యతో చర్చించారు.
మందుల తయారీలో వాడుతున్న వనమూలికల గురించి ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకూ ఆనందయ్యతో స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మినహా మరే నాయకుడు వెళ్లి చర్చించలేదు.
కానీ కరోనా కట్టడికి ఆయుర్వేద మందు బాగా పనిచేస్తోందని ప్రచారంతో ఖండంతరాల్లో పేరు మార్మోగుతున్న ఆనందయ్యను కలిసేందుకు స్వయంగా చెవిరెడ్డి ఆయుర్వేద వైద్య నిపుణులతో కలిసి వెళ్లి చర్చించడం, ఆయనలోని పట్టుదలను తెలియజేస్తోంది. పైగా శేషాచలం అడవుల్లో అపరిమితమైన వనమూలికల సంపదను కరోనా కట్టడికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆశయం చెవిరెడ్డిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాస ఆయుర్వేదిక్ ఫార్మసీలో సంబంధిత వైద్యులతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధం తయారీకి టీటీడీ సిద్ధమని టీటీడీ పాలకమండలి సభ్యుడు కూడా అయిన చెవిరెడ్డి స్పష్టం చేశారు.
వైద్యుల బృందంతో కలిసి ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని పరిశీలించామన్నారు. మందులో దుష్ఫ్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెబుతున్నారన్నారు. ఆ మందు వాడకంపై ఐసీఎంఆర్, ఆయుష్ నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు చెవిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఒకవేళ వాటి నుంచి ఆనందయ్య మందుకు అనుమతి లభిస్తే తామేం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్టు చెవిరెడ్డి తెలిపారు. శేషాచలం అడవుల్లో వనమూలికలు అందుబాటులో ఉన్నాయని చెవిరెడ్డి చెప్పారు.