ఆయుర్వేదం ఆనందయ్య Vs ఆర్జీవీ

వాళ్లు, వీళ్లు అని లేదు.. రామ్ గోపాల్ వర్మ ఎవర్నీ కదిలించకుండా వదిలిపెట్టరు. దేశంలో ఎక్కడ ఏ సంచలనం జరిగినా ఆర్జీవీ అందులో వేలు పెట్టాల్సిందే. తన మార్క్ సెటైర్ చూపించాల్సిందే. తాజాగా కరోనా…

వాళ్లు, వీళ్లు అని లేదు.. రామ్ గోపాల్ వర్మ ఎవర్నీ కదిలించకుండా వదిలిపెట్టరు. దేశంలో ఎక్కడ ఏ సంచలనం జరిగినా ఆర్జీవీ అందులో వేలు పెట్టాల్సిందే. తన మార్క్ సెటైర్ చూపించాల్సిందే. తాజాగా కరోనా ఆయుర్వేదం మందుతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఆనందయ్య వ్యవహారంలో కూడా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. సెటైర్లతో రెచ్చిపోయారు.

“ఆనందయ్య గారూ, నోరు, ముక్కు, చెవి గురించి నాకు తెలుసు.. కానీ కళ్లలో చుక్కల మందు వేసుకుంటే ఊపిరితిత్తుల సమస్య ఎలా తగ్గుతుందు” అని ప్రశ్నించారు. అయితే వర్మ తీసిన ఈ లాజిక్ కి చాచిపెట్టి కొట్టినట్టు ఓ నెటిజన్ సమాధానమిచ్చాడు. “వర్మా..! నీ–పై ఎవరైనా కొడితే.. నీ కంట్లో నుంచి నీళ్లు ఎందుకొస్తాయో.. ఇది కూడా అలాగే” అంటూ సమాధానం ఇచ్చాడు.

“అయితే ఇప్పుడు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ లకు ఇచ్చే నిధుల్ని ఆనందయ్యకు పంపించాలా..? జస్ట్ ఆస్కింగ్..” అంటూ మరో ట్వీట్ వేశాడు వర్మ. ప్రభుత్వం ఇక ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్ల గురించి ఆలోచించడం మానేసి.. ఆనందయ్యకు తేనె, వేపాకు పేస్ట్, గడ్డి, ఉల్లిపాయలు సప్లై చేయడం గురించి ఆలోచించాలంటూ మరో సెటైర్ పేల్చాడు.

ఫైజర్, మోడెర్నా కంపెనీలు తమ ఫార్ములాని ఎవరికీ ఇవ్వడంలేదని, అలాంటి సమయంలో ఉచితంగా అందరికీ కరోనా మందు పంచిపెడుతున్న ఆనందయ్యకు నోబెల్ బహుమతి ఎందుకివ్వకూడదని ప్రశ్నించాడు వర్మ.

అమెరికా నుంచి అధ్యక్షుడు జో బైడన్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుటు ఫౌచీ.. ఎయిర్ ఫోర్స్-1 విమానంలో నేరుగా కృష్ణపట్నంకు వస్తున్నారని, ఆనందయ్య ఫార్ములా తెలుసుకోడానికి వారు చర్చలు జరుపుతారని అన్నాడు ఆర్జీవీ. అయితే ఆనందయ్యను మాత్రం కిడ్నాప్ చేయకుండా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

మొత్తానికి ఆనందయ్య వ్యవహారంతో మరోసారి వర్మ వార్తల్లోకెక్కారు. నేరుగా ఆయుర్వేదం మందుని నమ్మట్లేదు అని చెప్పకుండానే.. సెటైర్లతో ఆనందయ్య మందుపై తన అక్కసు వెళ్లగక్కాడు.