విరాటపర్వం మంచి సినిమానే, కానీ జనం చూడలేదని కలెక్షన్లే చెబుతున్నాయి. దర్శకుడు వేణు చాలా సెన్సిటివ్. నిజాయితీగా సినిమా తీయాలనుకునే దర్శకుడు. విరాటపర్వం లాంటి సినిమాలు తరచుగా రావు. ఎపుడోఒకసారి వస్తాయి. అయితే కమర్షియల్‌గా దీన్ని దర్శకుడు నిలబెట్టలేకపోయాడు.
ఇది నటి సాయిపల్లవి విశ్వరూపం. ఆమె తప్ప ఈ సినిమాలో ఎవరూ లేరు. రావణుడు దుర్మార్గుడు అని చెబితేనే రాముడు గుణవంతుడని అర్థమయ్యేది. దుర్యోధనుడు దుష్టబుద్ధి అని తెలిస్తేనే మనం మానసికంగా పాండవుల పక్షం వహించేది. అలాంటి సంఘర్షణ సినిమాలో మిస్ అయ్యింది. దర్శకుడు వెన్నెల పాత్రతో ప్రేమలో పడి, ఆమె జర్నీని ఎంచుకున్నాడు కానీ, మిగతా వాళ్లని మరిచిపోయాడు.
పేపర్ మీద ఏం రాసుకున్నాడో తెలియదు కానీ, అది స్క్రీన్ మీద కనబడలేదు. ముఖ్యంగా రాణా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కాలేదు. చాలా సీన్స్‌లో అలా బ్లాంక్‌గా చూస్తూ వుంటాడు. కథని మలుపు తిప్పి , వెన్నెల మరణానికి కారణమయ్యే సమ్మయ్య అస్సలు రిజిస్టర్ కాలేదు. కోవర్ట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఒక సంఘర్షణ, వెన్నెల కాల్చివేత ఒక ఎమోషన్ ప్రేక్షకుల్ని కట్టి పడేయలేదు. మనసు భారంగా అనిపించినా, వెన్నెల మనల్ని వెంటాడకపోవడానికి క్లైమాక్స్ చుట్టూ సీన్స్ సరిగా ఫ్రేమ్ చేయకపోవడం.
దర్శకుడు తన శక్తుల్ని సాయిపల్లవి మీద పెట్టి వజ్రాలలాంటి నటుల్ని వేస్ట్ చేశాడు. నందితాదాస్ అంటే ఒక ఫైర్. సినిమాలో అపుడే డిస్చార్జ్ అయిన పేషెంట్లా నీరసంగా వుంది తప్ప, ఒక ఉద్యమ కార్యకర్తలా లేదు. జెరీనా వహబ్ ఒక అద్భుతం. ఆమె కూడా అంతంత మాత్రమే అయితే ఏం చేసేది? ప్రియమణి, ఈశ్వరిరావు, నివేదితా పేతురాజ్ వీళ్లంతా వేస్ట్ అయిపోయారు. గొప్ప నటులు వుండి కూడా దర్శకుడు ఫోకస్ చేయకపోవడానికి కారణం అతని దృష్టి అంతా వెన్నెలపైనే.
సాయిచంద్ కాసేపు కనిపించినా అతని రేంజ్, నటన వేరు. రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. “మా ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరొచ్చిండ్రు, అన్నలే కదా వచ్చిండ్రు” డైలాగ్‌తో అతని క్యారెక్టర్ లేచి నిలబడింది. మంచి కథ, క్యారెక్టర్ పడితే సాయిచంద్, రాహుల్ హాలీవుడ్ స్థాయి నటులు.
పాటలు బాగా వీక్. ఇట్లాంటి సినిమాల్లో ఒకట్రెండు వెంటాడే పాటలుండాలి. అవి లేవు. నక్సల్ మీద ఎత్తుగడలు వేసే పోలీస్ అధికారి బెనర్జీ ఒక మాట అంటాడు “వాళ్లంతా బానే వుంటారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇరుక్కుంటారు” అని. తమిళ సినిమాల్లో పా.రంజిత్ దగ్గర వినిపించే ఇలాంటి డైలాగ్‌లు తెలుగులో కూడా వినిపిస్తున్నాయంటే వేణు లాంటి చైతన్య దర్శకుల వల్లే.
నక్సలైట్ ఉద్యమం ఇప్పటి జనరేషన్‌కి అర్థం కాదు, అందుకే చూడలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఏం చెప్పినా బాగా చెబితే చూస్తారు. దానికి కాలంతో సంబంధం లేదు. Next time better luck వేణు!
ఫేస్బుక్ సమీక్షలు, ప్రశంసల వల్ల సినిమాలు నిలబడవు. విమర్శల వల్ల పడిపోవు. సినిమా నిలబడాలంటే రెండున్నర గంటలు ప్రేక్షకున్ని కూచోపెట్టాలి. అదే అసలు సమస్య.
జీఆర్ మహర్షి