రఘురామకృష్ణంరాజు కేసులో జగన్ సర్కార్ తరపు వాదనలు చూస్తే …వామ్మో, ఇదేం తెగువ అని ఎవరికైనా అనిపించక మానదు. అంతేకాదు కోర్టు ధిక్కరణ ఉత్తర్వులకు సంబంధించి జగన్ సర్కార్ బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు, సాక్షిలో అందుకు సంబంధించి వార్తను బ్యానర్‌గా ఇవ్వడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
టీడీపీ అనుకూల మీడియా కోర్టు ధిక్కరణ అంశాన్ని ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగించేలా హైలెట్ చేయాలని భావించగా, ప్రభుత్వ అనుకూల మీడియా దాన్నే అస్త్రంగా తీసుకుని కొన్ని వ్యవస్థలు ఇప్పటికీ బాబుకు ఎలా అనుకూలంగా ఉన్నాయో చూపే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
హైకోర్టులో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రతి వాదన వెనుక ఎంతో వ్యూహం , తెగింపు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామకృష్ణంరాజు కేసు విచారణలో ఎత్తుకు పైఎత్తులను గమనించొచ్చు. రఘురామకృష్ణంరాజు కేసును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే.
నిన్న విచారణలో భాగంగా జస్టిస్ కన్నెగంటి లలిత, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య వాడివేడిగా వాదనలు జరగడం గమనార్హం. గతంలో పలువురు న్యాయమూర్తులపై జగన్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ న్యాయమూర్తుల్లో కన్నెగంటి లలిత కూడా ఒకరు కావడం గమనార్హం.
ఇక ప్రస్తుతానికి వద్దాం. రఘురామకృష్ణంరాజు కేసుపై హైకోర్టులో విచారణ సందర్భంగా… ఎంపీకి రమేశ్ ఆసుపత్రిలోనూ వైద్యపరీక్షలు నిర్వహించాలంటూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని తాము ఆదేశాలిచ్చామని, వాటిని ఎందుకు అమలు చేయలేదని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్ చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చారని ఏఏజీ తెలిపారు. వాటిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశించలేదన్నారు.
ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్‌కు లేదన్నారు. వీటిని అమలు చేయాలని అధికరణ 226 కింద హైకోర్టు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 54ను ఓసారి చూడాలని, దాన్ని చదివితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఎలా చట్టవిరుద్ధమో అర్థమవుతుందని వాదించారు.
దాంతో తమకు సంబంధం లేదని, ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది మాత్రమే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే వాటిని హైకోర్టులో సవాల్ చేసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తాము ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశామని సుధాకర్‌రెడ్డి వివరించారు.
రాత్రి 12 గంటలకు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయడం ఎలా సాధ్యం? అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు ఆమె తెలిపారు. మీరేం చెప్పాలనుకున్నా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో చెప్పుకోండని ఆమె తేల్చి చెప్పారు.
కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చెప్పే విషయాలను నమోదు చేయాలని సుధాకర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఆ అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ లలిత తెలపగా… తన వాదనలు వినేందుకు సిద్ధంగా లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోతానని సుధాకరరెడ్డి తీవ్రంగా స్పందించడం గమనార్హం. తన వాదనలు విననప్పుడు తాను ప్రభుత్వం తరఫున హాజరవడంలో అర్థం ఏముందని ఆయన స్వరం పెంచుతూ ప్రశ్నించారు.
న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తామిచ్చిన ఉత్తర్వులను తప్పని చెప్పే అధికారం మీకు లేదంటూ సుధాకర్‌రెడ్డికి స్పష్టం చేశారు. సుధాకర్‌రెడ్డి మరింత స్వరం పెంచుతూ …తాము ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే హక్కు తమకు ఉందని ధర్మాసనానికి తేల్చి చెప్పారు. అయినా ఈ కేసులో అంత ప్రత్యేక ఆసక్తి ఏముందని సుధాకర్‌రెడ్డి జస్టిస్ లలితను ప్రశ్నించారు. దీంతో జస్టిస్ లలిత తీవ్రంగా స్పందిస్తూ…తమకు ప్రత్యేక ఆసక్తి ఏమీ లేదని స్పష్టం చేశారు.
కంట్రోల్లో ఉండి మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు. కోర్టు ఆఫీసర్‌గా మీరు ఏమి ఆలోచిస్తున్నారని జస్టిస్ లలిత ప్రశ్నించారు. చెప్పింది ఇక చాలని ఒక దశలో ఏఏజీపై జస్టిస్ లలిత అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు ఏఏజీ తీవ్ర స్వరంతో వాదనలు చెప్పడాన్ని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో నమోదు చేయడం గమనార్హం. మొత్తానికి హైకోర్టులో హోరాహోరీ నడిచిందని చెప్పొచ్చు.